ఇదేం నీతి?? మహేశ్‌కి ఓ లెక్క.. పవన్‌కి మరో లెక్కా!?
on Sep 17, 2018
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మీద చోటా తమిళ్ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ విమర్శలు చేశాడు. మహేశ్‌ని రాయితో, మగ కత్రీనా కైఫ్‌తో పోల్చాడు. మనోజ్ చేసింది ముమ్మాటికీ తప్పే. ప్రతి ఒక్కరూ ఇటువంటి చర్యలను ఖండించి తీరాల్సిందే. అందులో మరో సందేహం లేదు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కూడా మనోజ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ తమిళ నడిగర్ సంఘం పెద్దలకు ఓ లేఖ రాసింది. 'మా' స్పందించిన తీరు అభినందనీయమే. అయితే... ఇదే 'మా' పవన్‌ని తిడితే ఎందుకు స్పందించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.
'మా' మహేశ్ అంటున్నారే! పవన్ కాదా? అని సూటిగా సెటైర్స్ వేస్తున్నారు. శ్రీరెడ్డి కావొచ్చు... అంతకు ముందు కత్తి మహేశ్ కావొచ్చు... శ్రీరెడ్డికి పవన్‌ని తిట్టమని తానే సలహా ఇచ్చానని నిసిగ్గుగా చెప్పిన రామ్‌గోపాల్ వర్మ కావొచ్చు.. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, తెలుగు టీవీ చర్చల్లో ఎన్నెన్ని విమర్శలు చేశారో, పిల్లలు వినరాని మాటలు ఎనెన్ని అన్నారో తెలిసిందే. వర్మ అయితే వీలు దొరికితే చాలు... మెగా హీరోల మీద పడతారు. శ్రీరెడ్డి విషయంలో పవన్ ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చి ధర్నా చేసే వరకూ టీవీల్లో రచ్చ రచ్చ చేశారు. అప్పుడు 'మా' ఎందుకు స్పందించలేదనేది కొందరి ప్రశ్న! ఇదేం నీతి?? మహేశ్‌కి ఓ లెక్క.. పవన్‌కి మరో లెక్కా!? అని 'మా' తీరుని ఎండగడుతున్నారు. మెగా హీరోలు 'మా'లో సభ్యులు కాదా? మహేశ్ ఒక్కడే సభ్యుడా? ఎందుకీ ద్వంద వైఖరి? పవన్ మీద రాజకీయంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వ్యక్తులు వున్నారు. ఏమైనా అంటే... అది తమ భావ ప్రకటన స్వేచ్ఛగా సో కాల్డ్ మేథావులు చెప్పుకున్నారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరుపై వస్తున్న విమర్శల విషయంలో 'మా' పెద్దలు ఏం సమాధానం చెబుతారో??