చిరు సెంచరీ... సినిమా కూడా వందాడింది!
on Jun 26, 2018
చిత్రసీమలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. చిరంజీవికీ కొన్ని సెంటిమెంట్లున్నాయి. `ఖైది`తో ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్‌కి కూడా ఆ సినిమా ఓ మైల్ స్టోన్‌గా మరింది. 150వ సినిమాకి ఖైది పేరుని గుర్తు చేస్తూ `ఖైది నెం.150` అనే టైటిల్‌ని పెట్టుకున్నారు చిరు. అదీ సెంటిమెంట్ అంటే. ఇదే సెంటిమెంట్ తన వందో సినిమాకీ ఫాలో అయ్యారు. ఖైది నెం.786 అనే టైటిల్‌తో వందో సినిమా చేశారు చిరంజీవి. అది కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. చిరంజీవి - భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయబాపినీడు దర్శకత్వం వహించారు. అయితే ఇది ఓ తమిళ చిత్రానికి రీమేక్. విజయ్‌కాంత్, రాధ జంటగా నటించిన `అమన్ కోవిల్ కిలకిలే` (అమ్మవారి గుడికి తూర్పుగా)ని తెలుగులో `ఖైది నెం 786`గా తీశారు.
ఈ రెండు టైటిళ్లలోనూ ఎంత మార్పు ఉందో చూడండి. అదీ చిరంజీవి ఇమేజ్ అంటే. టైటిల్లోనే కాదు, కథ.. కథనాలు కూడా చిరు స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా వండి వార్చారు. మాస్ పాటలు, ఫైటులతో.. చిరంజీవి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ కథని తీర్చిదిద్దారు. రాజ్‌కోటి అందించిన పాటలన్నీ సూపర్ హిట్టే. గువ్వా గోరింకతో.. అయితే ఓ ఊపు ఊపేసింది. ఈ పాటని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కోసం రీమిక్స్ చేశారు. అయితే... అప్పటి మజా ఈ రీమిక్స్‌లో రాలేదు. అటు అమలాపురం - అటు పెద్దా పురం మధ్య గోదావరి అనే పాటైతే మార్మోగిపోయింది. చిరంజీవిలాంటి స్టార్ ఉన్న సినిమాలో ఓ ఐటెమ్ గీతాన్ని మోహన్‌బాబు, కోట - సిల్క్స్మితపై ప్లే చేయడం అప్పట్లో ఓ సాహసం. ఈ పాటని కూడా మరో మెగా హీరో అల్లు శిరీష్ సినిమా `కొత్త జంట` కోసం రీమిక్స్ చేశారు. అక్కడా పండలేదు.
ఈ సినిమాలో ఫైట్లు కూడా మాస్‌కి తెగ నచ్చేశాయి. ఓ గీత గీసి `దమ్ముంటే ఈ గీత దాటి రా` అంటూ ఓ ఫైటర్ సవాల్ విసరడం, చిరు కూడా ఓ గీత గీసి ప్రతి సవాల్ విసరడం... అప్పట్లో థ్రిల్ కలిగించాయి. కథ, కథనాలు మామూలుగానే ఉన్నా... పాటలు, ఫైటులూ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. కేవలం ఫైట్స్ చూడ్డానికే జనం రెండోసారి మూడోసారి కూడా థియేటర్ ముందు వరుసకట్టేవారు. యావరేజ్ టాక్‌తో విడుదలైన ఈసినిమా.. ఆతరవాత.. హిట్, సూపర్ హిట్‌గా నిలబడిపోయింది. హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో వంద రోజులు ఆడిందీ సినిమా. 75 రోజుల పాటు థియేటర్ ముందు హౌస్‌ఫుల్ బోర్డు తప్పక దర్శనమిచ్చేది. అలా చిరు అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఖైదీ నెం 786ని మరోసారి మీ ముందుకు తీసుకొచ్చింది తెలుగు వన్. ఆ సూపర్ హిట్ చిత్రాన్ని మరోసారి వీక్షించండి.