ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన మహేశ్
on Jan 26, 2018
ఘట్టమనేని మహేశ్ బాబు అశేష అభిమానులు, ప్రజలు, అధికారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. మహేశేంటీ..? సీఎం ఏంటీ..? ఏం అర్థం కావడం లేదా..? కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చేస్తున్నాడు సూపర్‌స్టార్. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తో పాటు ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తోన్న స్టిల్స్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే కానుకగా భరత్ అను నేను టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ ఆడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఆడియోలో భరత్ అనే నేను..శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను, శ్రద్ధతో, శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కానీ పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని , శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’ అంటూ రాజ్యాంగ బద్ధంగా గవర్నర్ ఎలా అయితే ప్రమాణం చేయిస్తారో అచ్చం అదే విధంగా మహేశ్ బేస్ వాయిస్‌తో చెప్పడం బాగుంది. మరో వైపు బ్రీఫ్‌కేస్ పట్టుకొని నడుచుకుంటూ వస్తోన్న మహేశ్ ఫస్ట్‌లుక్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.