English | Telugu

జై సింహా రివ్యూ

on Jan 12, 2018

 

తారాగణం: బాలకృష్ణ, నయనతార, నటాషా, ప్రకాశ్ రాజ్...
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్

 కథ, కథనం సిద్ధంగా ఉంటే... దర్శకుడిలో సత్తా ఉంటే.. దాన్ని ఎంతబాగా అయినా తీయొచ్చు. కానీ.. కనీసం కథైనాలేకుండా సెట్స్ కి వెళితే? జంతువులు కూడా చూడలేని కళాఖండాలొస్తాయ్. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి అదే.  కథ లేకపోయినా ఫర్లేదు. పేపర్ వర్క్ పూర్తవ్వకపోయినా పర్లేదు.  హీరో డేట్స్ ఉంటే చాలు.. సెట్ కి వెళ్లి పోతున్నారు. ‘తీసుకుంటూపోతే ఏదో ఒకటి తయారవుతుందిగా!’. అనేది వాళ్ల ఉద్దేశం అయ్యుండొచ్చు. ఇక్కడ దర్శకుడ్ని మాత్రమే నిందించడానికీ లేదు. నిర్మాత కూడా బాధ్యుడే. పేషన్ ఉన్న ఏ దర్శక నిర్మాతా ఇలాంటి పనులు చేయరు. కనీసం హీరోకైనా జడ్జిమెంట్ ఉంటే ఇలాంటి పొరపాట్లు జరగవ్. ఈ సంక్రాంతి రెండో కోడి పుంజు ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. అదే... ‘జై సింహా’. ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు.. కొన్ని విషయాలను డిస్కస్ చేయాలనిపించింది. అందుకే.. ఈ ఉపోద్ఘాతం. గత సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గా తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుతాన్ని అందించిన బాలయ్య... ఈ సంక్రాంతికి ఆ ఫీట్ రిపీట్ చేశాడా? బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ని ‘జై సింహా’ నిజం చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం.

కథ:-

అప్పుడే పుట్టిన పసిగుడ్డను తీసుకొని హాస్పటల్ నుంచే బయలుదేరతాడు నరసింహ. ఆ బిడ్డ ప్రశాంతంగా ఎదగడానికి ఎక్కడెక్కడికో తిరుగుతాడు. చివరకు తమిళనాడు కుంబకోణం చేరతాడు. అక్కడ స్థిరనివాసాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే... ఎక్కడ అన్యాయం జరిగినా  సహించని తత్వం నరసింహది. అందుకే.. కుంబకోణంలో జరుగుతున్న అన్యాయాలకు ఎదురు నిలిచి... అక్కడి సంఘవ్యతిరేక శక్తులకు శత్రువు అవుతాడు. వాళ్లు నరసింహను దెబ్బ తీయలేక... అతని బిడ్దను చంపబోతారు. ఆ విషయం తెలుసుకున్న నరసింహా దుండగులను దునుమాడి.. బిడ్డను కాపాడుకుంటాడు. అయితే... ఇక్కడ ట్విస్ట్  ఏంటంటే.. వాళ్లు ఎత్తుకొచ్చింది నరసింహ బిడ్డను కాదు. అదే పోలికలతో ఉన్న మరో బిడ్డను. నరసింహ బిడ్డ పోలికలతోనే ఆ బిడ్డ ఎందుకున్నాడు? అసలు ఆ బిడ్డ ఎవరి బిడ్డ? అసలు ఏ తల్లి పక్కనున్న పసిగుడ్డను హాస్పటల్ నుంచి నరసింహ ఎత్తుకొచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

విశ్లేషణ:-

సినిమా చూశాక కూడా ఇలాగే పలు ప్రశ్నలు వెంటాడుతుంటాయ్. ఆసాంతం చూాశాక కూడా  ప్రశ్నలు వెంటాడటం ఏంటి? అనేగా మీ ప్రశ్న? ఈ సినిమా ప్రత్యేకత అదే. చెడ్డవాళ్లు ఉన్నట్టుండి మంచోళ్లు అవుతుంటారు. ఏలా? అని అడక్కండి! కథ ప్రకారం హీరోకి, హీరోయిన్ తండ్రికి మాత్రమే తెలిసిన కీలక రహస్యం...  కారణం లేకుండా విలన్లకు తెలిసిపోతుంది.  ఎలా? అని అడక్కడి! ఇలా సమాధానం తెలీని ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి ఇందులో. హీరో వయసేంటి? ఎలాంటి సీన్లు అతనిపై ఉండాలి. ఎలాంటివి ఉండకూడదు. ఒక వేళ ఉండకూడని సీన్లు ఉంటే.. వాటి లెన్త్ ఎంత ఉండాలి? అనే మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా సినిమా తీసి... నరకానికి స్పెల్లింగ్ రాయించాడు దర్శకుడు కె..ఎస్.రవికుమార్. దీనికి తోడు అరవ కామెడీ. ఇక బాలయ్య... నటునిగా ఆయన్ను వంకపెట్టడానికి లేదు. పైగా రౌద్రరసం బాలయ్య ఏ స్థాయిలో పండిస్తారో తెలిసిందే కదా. ఇందులో కూడా విశ్వరూపం చూపించేశాడు. నిజానికి బాలయ్య వల్లే ఇందులో కొన్ని సన్నివేశాలు పేలాయ్. అవి అభిమానులకు కూడా బాగా నచ్చుతాయ్. ముఖ్యంగా 58 ఏళ్ల వయసులో బాలయ్య వేసిన స్టెప్పులు ఆశ్చర్యానికి లోను చేస్తాయ్.  ప్రథమార్ధం సినిమా ఫర్లేదనిపించిందంటే.. ఓన్లీ రీజన్ బాలకృష్ణ. ద్వితీయర్ధం కథ సరిగ్గా రాసుకోకుండా అర్థంలేని లింకులతో ప్రేక్షకులను నరకయాతనకు గురిచేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ మాత్రమే కె.ఎస్.రవికుమార్ చేశాడా? సెకండాఫ్ సి.కల్యాణ్ కూడా డైరెక్ట్ చేశాడా? అనే అనుమానాలు కూడా కలుగుతాయ్.

ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. రెండుమూడు పాటలు బావున్నాయ్. చిరంతన్ భట్ రీరికార్డింగ్ సహనానికి పరీక్ష. అసలే నత్త నడక నడుస్తున్న సినిమాను ఈయన గారి హార్మని ఇంకాస్త కృంగదీసింది.  రామ్ లక్ష్మన్ రక్తపాతం మామూలుగా లేదు.  బిడ్డ అడ్డం తిరిగిన గర్భిణికి ఈ సినిమా చూపిస్తే... సిజేరియన్ చేయకుండానే సుఖ ప్రసవం అవుతుంది. అంత దారుణమైన రక్తపాతం. ఎడిటింగ్ వర్క్ అయితే... చాలా వరకు మిగిలి ఉంది.

టోటల్ గా... ప్రథమార్ధం మాత్రమే జై సింహా.. ద్వితీయార్థం.. నయ్ సింహా!

రేటింగ్: 2.25/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here