లొకేషన్లో మెగా సాహసం..
on Jan 2, 2018
వయసు చూస్తే.. 60కి పై మాటే. పదేళ్ల నుంచి ఫిజికల్ యాక్టివిటీసే లేవ్. ఉన్నట్లుండి మళ్లీ సినిమాలు షురూ చేశాడు. ‘ఖైదీ నంబర్ 150‘ అంటూ బాక్సాఫీస్ దగ్గర హల్ చల్ చేశాడు. ఇప్పుడు ‘సైరా నరసింహా రెడ్డి’ అంటూ హిస్టారికల్ కథను ‘ఓకే’ చేసి.. సెట్స్ కి తీసుకెళ్లాడు. అదేమో... స్వాతంత్ర్య సమరోయోధుని సబ్జెక్ట్. శారీరక శ్రమ అవసరం. గుర్రాలు నడపాలి. ఎగిరెగిరి దూకాలి... కత్తి యుద్ధాలు గట్రా చేయాలి. మరి వయసులో ఇంత స్ట్రగుల్ అవసరమా?
స్వయంకృషి అనే పదానికి పర్యాయపదం ఆయన. ఇంత స్ట్రగుల్ అనుభవించకపోతే... ఆయన మెగాస్టార్ ఎందుకు అవుతాడు. నంబర్ వన్ అని ఎందుకు అనిపించుకుంటాడు. 60 దాటిందని అడుగులు వెనక్కు వేనక్కు వేస్తాడా? శరీరం నలిగిందని శ్రమను మరిచిపోతాడా? అదే రక్తం.. అదే వ్యక్తిత్వం. దటీజ్ మెగాస్టార్. ‘సైరా నరసింహారెడ్డి’ సెట్ లో జరిగిన ఓ సంఘటన... మెగాస్టార్ నైజాన్ని ప్రతిబింభిస్తుంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే యుద్ధ సన్నివేశాలు ప్లాన్ చేశాడు. మొండేలు అతుకొని ... ‘v’ షేప్ లో ఉన్న రెండు చెట్లను ఏర్పాటు చేశారు. సరసింహారెడ్డి గుర్రంపై వాయువేగంతో వచ్చి.. ఆ చెట్ల మధ్య నుంచి గుర్రాన్ని దూకించి ఉరికించాలి. ఇధి షాట్. చిరంజీవికి వివరించారు. ఆయన గుర్రం వంక... చెట్ల వంక చూశారు. ‘ఓకే’ అని చెప్పి కారవాన్ లోకి వెళ్లిపోయారు. ఈ లోపు ఈ షాట్ వివరాలు చరణ్ కి తెలిశాయ్. అంతే ఆయన షాక్. సురేందర్ రెడ్డి ని పిలిచి ససేమిరా అన్నాడు. ఇలాంటివి ప్లాన్ చేసేముందు వాటి వివరాలు తనకు చెప్పాలని సూచించారు. ఆ సన్నివేశాన్ని డూప్ ని పెట్టి లాగించేయాలని ఆర్డర్ వేశాడు. చిరంజీవి కేరవాన్ లో నుంచి వచ్చే లోగా... ఒక డూప్ కి నరసింహారెడ్డి గెటప్ వేయించి షూట్ చేస్తున్నారు. అది చూసిన చిరంజీవి ‘ఏంటిది? ’ అనడిగారు. ‘అదే సార్.. డూప్ తో లాగిచేద్దాం. చరణ్ గారు ఊరుకోవడం లేదు. మాక్కూడా రిస్కేమో అనిపించింది’ అని చెప్పాడు సురేందర్ రెడ్డి. అంతే... మెగాస్టార్ కి ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చింది. ఎవరితో మాట్లాడకుండా... సైలెంట్ గా గుర్రం ఎక్కారు. కళ్లెం చేతబట్టి... ఒక్క లాగు లాగి.. కలితో దాన్ని ఒక్క తన్ను తన్నారు. అంతే... గుర్రం పరుగందుకుంది... 63 ఏళ్ల వయసులో.. గుర్రాన్ని ఉరకలెత్తిస్తూ.. ఆ చెట్ల దగ్గరకు వచ్చి... అమాంతం.... దూకించేశాడు మెగాస్టార్. అంతే లొకేషన్లో అంతా షాక్. కెమెరా ఫిక్స్ చేయక ముందే... సరదాగా వారితో ఆ ఫీట్ చేసి చూపించి... అందరినీ విస్మయానికి గురి చేశాడు మెగాస్టార్. తర్వాత కెమెరా ముందు కూడా... చెలరేగిపోెయారు. చరణ్ కి అయితే... నోటి వెంట మాట రాలేదట.
ఇది లొకేషన్లో ప్రత్యక్షంగా చూసిన వారి నుంచి తెలిసిన వార్త. మరి మెగాస్టారా? మజాకా?