దీన్ని అమాయకత్వం అనాలా? మూర్ఖత్వం అనాలా?
on Nov 7, 2017
ట్రెండ్ అనే పదమంటే అస్సలు ఇష్టపడని హీరో బాలకృష్ణ. ఇంకా మాట్టాడితే... మేం ఏం చేస్తే అదే ట్రెండ్ అంటారాయన. హీరోలందరూ ట్రెండ్ ని బట్టి వెళుతుంటే.. బాలయ్య మాత్రం తానకు నచ్చిన దారిలోనే వెళుతుంటారు. ఈ క్రమంలో ఎదురు దెబ్బలు కూడా బాగానే తగులుతుంటాయ్. కానీ కేర్ చేయడు.
అంతేకాదు సక్సెస్ వెంట పరిగెత్తడం కూడా బాలయ్యకు అస్సలు తెలీదు. మంచి కథ అనిపిస్తే.. అట్టర్ ఫ్లాపులిచ్చిన దర్శకునికి కూడా అవకాశం ఇచ్చేస్తాాడు. ఇంకా మాట్లాడితే కొత్త వాళ్లను కూడా పరిచయం చేసేస్తాడు. దటీజ్ బాలకృష్ణ తన రెండో సినిమా ‘డిస్కోకింగ్’కి అసలు విజయం అంటే ఏంటో తెలియని తాతినేని ప్రసాద్ అనే దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఇది గాక ఇతనితోనే పల్నాటి పులి, ఆత్మబలం సినిమాలు చేశాడు.
లెజెండ్రీ రచయిలు పరుచూరి బ్రదర్స్ ని దర్శకులుగా పరిచయం చేసిన క్రెడిట్ కూడా బాలయ్యదే. ‘భలేతమ్ముడు’ చిత్రంతో వారిద్దరూ దర్శకులయ్యారు. ఎన్.బి.చక్రవర్తి అనే దర్శకుడికి అవకాశం ఇచ్చి ‘కత్తుల కొండయ్య’ అనే సినిమా చేశాడు. మళ్లీ అతనితోనే.. ’నిప్పులాంటి మనిషి’ చేశాడు.
నందమూరి రమేశ్ ని దర్శకునిగా పరిచయం చేసి ‘అల్లరి కృష్ణయ్య’ చేశాడు. అలాగే స్వర్ణ సుబ్బారావుని దర్శకునిగా పరిచయం చేస్తూ.. ‘విజయేంద్రవర్మ’ చేశాడు.
మహాదేవ్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘మిత్రుడు’ అనే సినిమా చేశాడు. అప్పటివరకూ ఒక్క సరైన సినిమా చేయని శేఖర్ రాజా దర్శకత్వంలో మంచువారు నిర్మించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ అనే సినిమాలో తన ఇమేజ్ ని పక్కన పెట్టి తాను చేయకూడని పాత్ర చేశాడు.
అంతేనా.. అంత వరకూ పెద్ద హీరోలతో ఒక్క సినిమా కూడా చేయని రవి చావలికి అవకాశం ఇచ్చేసి ‘శ్రీమన్నారాయణ’ చేశాడు. సత్యదేవ్ అనే వ్యక్తి వచ్చి ఏదో కథ వినిపించేస్తే... అది ‘ఓకే’ చేసేసి... అతనితో ‘లయన్’ సినిమా చేశాడు. అది కూడా ఎప్పుడూ!.. ‘లెజెండ్’ లాంటి లెజెండ్రీ హిట్ తర్వాత.
సీనియర్ హీరోతో ఒక్క సినిమా అనుభవం కూడా లేని శ్రీవాసుకి అవకాశం ఇచ్చేసి ‘డిక్టేటర్’ చేశాడు. దీన్ని బట్టి ఒకటి ఒక విషయం అర్థమై ఉండాలి. అదేంటంటే.. బాలకృష్ణ పరిచయం చేసినంతమంది దర్శకులను ఇప్పుడున్న ఏ హీరో పరిచయం చేయలేదు అన్న విషయం.
ఇంతమంది దర్శకులకు.. వాళ్ల కెరీర్ ఎలా ఉందో చూసుకోకుండా.. సక్సెస్ రేట్ పట్టించుకోకుండా... వెనకా ముందూ ఆలోచించకుండా కేవలం వాళ్లపై నమ్మకంతో అవకాశం ఇచ్చాడు బాలయ్య. కానీ.. దారుణమైన విషయం ఏంటంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు విజయాన్ని ఇవ్వలేదు. సరికదా.. దారుణమైన ఫ్లాపులిచ్చి.. ఆయన ఇమేజ్ నే డామేజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఇంత జరిగాక ఎవరైనా.. మళ్లీ అలాంటి తప్పు చేయరు. కానీ.. బాలయ్య చేస్తాడు. పైగా దాన్ని ఆయన తప్పు అనుకోడు. ‘అది వాళ్ల బ్యాడ్ లక్’ అంటారాయన. నిజానికి క్కూడా ఎన్ని అపజయాలు ఎదురైనా.. బాలయ్య మార్కెట్ లో ఏ మాత్రం తేడా రాలేదు. స్టార్ డమ్ లో ఇసుమన్నా డేమేజ్ జరగలేదు. ఆరుపదలు వయసు దగ్గర పడుతున్నా.. వంద సినిమాలు చేసినా.. ఇప్పటికీ సినిమా సినిమాకీ హైప్ పెరుగుతూనే ఉంది. దజీట్ బాలయ్య.
ఇప్పుడు ఇదంతా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే అనుమానం మీకు కలగొచ్చు. ప్రస్తుతం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తేజా దర్శకత్వంలో ఎన్టీయార్ బయోపిక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. అందరికీ షాక్ ఇస్తూ.. ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయడానికి తెగబడ్డాడట బాలయ్య. ఎస్వీ కృష్ణారెడ్డి మెగా ఫోన్ వదిలేసి యుగం అయ్యింది. అసలు ఈ జనరేషన్ పోకడలు ఆయనకు తెలీదు. అలాంటి దర్శకునికి మళ్లీ అవకాశం ఇవ్వడమంటే.. దాన్ని అమాయకత్వం అనాలా? మూర్ఖత్వం అనాలా? లేక అతి మంచితనం అనాలా?
కృష్ణారెడ్డి కథ నచ్చిందట. ఎన్టీయార్ బయోపిక్ కంటే ముందు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా చేస్తాడట. ఫిలింనగర్ లో చాలా బలంగా వినిపిస్తున్న వార్త ఇది. దానికి తగ్గట్టే ఎన్టీయార్ బయోపిక్ దర్శకుడు తేజా కూడా ముందు వెంకటేశ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వాతావరణం చూస్తుంటే.. కృష్ణారెడ్డి సినిమా ఖరారైనట్టే ఉంది. గతంలో బాలయ్యకు ఇదే కృష్ణారెడ్డి ‘టాప్ హీరో’ అనే టాప్ ఫ్లాట్ ఇచ్చాడు. అంతటి అనుభవం తర్వాత మళ్లీ కృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వడం అభిమానులు ఆనందించాల్సిన విషయమా?.. లేక బాధ పడాల్సిన విషయమా? కాలమే సమాధానం చెప్పాలి?