కథ ఉన్నా.. హీరో లేడు.. అది పరిస్థితి
on Oct 30, 2017
‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి ఖ్యాతి ఆకాశానికి అంటుకుంది.. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ ఇప్పుడు రాజమౌళీతో చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. రాజమౌళీ ఎప్పుడు పిలుస్తాడా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఛాన్స్ నాకొస్తుందంటే.. కాదు నాకొస్తుందని లోలోపలే ఘర్షణకు లోనవుతున్నారు... మొన్నటిదాకా ఎక్కడ చూసినా ఇలాంటి మాటలే...కానీ.. ఇవన్నీ పులిహార కబుర్లని తేలిపోయింది.
‘బాహుబలి’ హడావిడి ముగిసింది. ఇప్పుడు నెక్ట్స్ సినిమా చేయడానికి రాజమౌళి దగ్గర కథ లేదు. కథ కోసం ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయ్. చిత్రం ఏంటంటే.. ఇప్పుడు కథ రెడీ అయినా... దర్శకధీరుడు సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలెవరూ సిద్ధంగా లేరు. ఇప్పటికిప్పుడు రాజమౌళి సినిమా చేయాలంటే.. రెడీగా ఉన్న హీరోలు ఎవరో తెలుసా? నాని, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్... వీళ్లన్నమాట.
అంతపెద్ద విజయం తర్వాత రాజమౌళికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఏంటి? అనుకుంటున్నారా? దానికి కారణం ఒక్కటే... స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేకపోవడమే. పవర్ స్టార్ మొదట్నుంచీ రాజమౌళి విషయంలో పెద్దగా ఉత్సాహం చూపించిన దాఖలాలు లేవు. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఆయన దృష్టి అంతా రాజకీయాలపైనే. ఇక మహేశ్.. ఈయనగారి డైరీ.. 2020 దాకా ఫుల్. ప్రస్తుతం కొరటాల శివతో ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ఉంటుంది. ఆ తర్వాత బోయపాటికి ఇచ్చేశాడు. ఆ తర్వాత రాజమౌళికి అన్నమాట. అంటే.. మూడేళ్ల వరకూ మహేశ్ గురించి రాజమౌళి మాట్లాడకూడదు.
ఇక ఎన్టీయార్.. మొన్ననే త్రివిక్రమ్ సినిమా మొదలైంది. ఆ సినిమా తర్వాత కానీ ఇంకో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆ సినిమా పూర్తవ్వడానికి ఏడాది పడుతుంది. అల్లు అర్జున్ ఇప్పటికే ‘నా పేరు సూర్య నా ఊరు ఇండియా’ షూటింగ్ లో బిజీ బిజీ. సమ్మర్ లో ఈ సినిమా విడుదల. అప్పటిదాకా బన్నీని కదిలించడానికి లేదు. రామ్ చరణ్... ప్రస్తుతం ‘రంగస్థలం’లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి దాకా ఈ హడావిడే చరణ్ కి సరిపోతుంది. ఇక మిగిలింది ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాలతో దాదాపు మూడేళ్లు రాజమౌళికి రాసిచ్చేశాడు. ఇప్పుడు బయటపడి.. ‘సాహో’ చేస్తున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.
సో... ఒక్క హీరో కూడా ఖాళీగా లేడు. నిజానికి నాని, శర్వానంద్, సాయిధరమ్ తేజ్.. లాంటి హీరోలు కూడా బిజీగానే ఉన్నారు కానీ.. ‘రాజమౌళి’ అంటే టెమ్ట్ అవ్వకుండా ఉండలేరు కదా. దీనిబట్టి అర్థమైందేంటి? చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ ‘కింగ్’ అంటే హీరోనే. బాబుల డేట్లు కోసం దర్శకేంద్రులైనా.. దర్శకధీరులైనా ఆగాల్సిందే. అదన్నమాట విషయం.