ENGLISH | TELUGU  

స్పైడర్ మూవీ రివ్యూ

on Sep 27, 2017

తారాగణం: మహేశ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్...
దర్శకత్వం: మురుగదాస్
నిర్మాత: ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్

కొన్ని కథలు వినడానికి బావుంటాయ్. చూడ్డానికి బాగోవ్. చూడ్డానికి బావుండే కథలు వినడానికి బాగోవ్. అందుకే... కథలు ఎంపికలో... ప్రతిభావంతులైన దర్శకులు సైతం పప్పులో కాలేస్తుంటారు. కేరక్టైరైజేషన్లు బావుంటాయ్. నడక బావుంటుంది. కథ కూడా పర్లేదనిపిస్తుంది. కానీ... ఏదో మిస్సయిన ఫీలింగ్. ఈ కారణం చేతే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు కోకొల్లలు. అలాగే.. కొన్ని సినిమాల్లో చెప్పుకోడానికి కథే ఉండదు. కానీ... జనాన్ని మాయ చేసేస్తాయ్. బ్లాక్ బాస్టర్స్ అయి కూర్చుంటాయ్. ఇది ఎవరి చేతుల్లో లేని విషయాలు. తలరాత అంతే. మురుగదాస్ గతంలో తీసిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమా బావుంటుంది. టెక్నికల్ గా కూడా హాలీవుడ్ సినిమా చూసినట్టుంటుంది. కానీ... జనాలు ఎందుకో దాన్ని పెద్దగా లైక్ చేయలేదు. ‘తుపాకి’ సినిమాలో అసలు సరైన కథే ఉండదు. కానీ... వంద కోట్లు వసూలు చేసింది. సో... ఇక్కడ జనం మెచ్చిందే సినిమా.

ఈ బుధవారం... మహేశ్ ‘స్పైడర్’ సినిమా విడుదలైంది. మురుగదాస్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయ్. మరి ఆ అంచనాలను ‘స్పైడర్’ నిజం చేసిందా? మురుగదాస్ జనం మెచ్చే సినిమా తీశాడా? ఈ ప్రశ్నలకు జనాలే సమాధానం చెబుతారు. ఈ సినిమా ఎలా ఉంది? అనే విషయాలు మాత్రం మనం చెప్పుకుందాం.

కథ:

ఇంటలిజంట్ బ్యూరో డిపార్ట్ కి సంబంధించిన ఆఫీస్ లో... ఏ మాత్రం అధికారాలు లేని  సామాన్యమైన ఉద్యోగం చేస్తుంటాడు శివ. సమస్యల్లో ఉన్న వారిని కాపాడటానికి... డిపార్ట్మెంట్ కి తెలీకుండా...  ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ ని తయారు చేస్తాడు. దాని ద్వారా... సమస్యల్లో ఉన్నవారిని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో... సమాజానికే ఓ పెద్ద సమస్య రాబోతోందని తెలుసుకుంటాడు శివ. ఇంతకీ ఆ సమస్య ఏంటి? ఆ సమస్యను ఏ విధంగ అధిగమించాడు అనేది మిగలిన కథ.

విశ్లేషణ:

‘ఠాగూర్’ సినిమాలోని ప్రకాశ్ రాజ్ పాత్ర హీరో అయితే... ఎలా ఉంటుంది? అంటే... అదే ‘స్పైడర్’. సమకాలీన సమస్యల ఆధారంగా కథలు తయారు చేసుకొని.. వాటికి కమర్షియల్ కోటింగ్ అద్ది విజయాలను అందుకోవడం మురుగదాస్ స్టైల్. రమణ, ఠాగూర్, స్టాలిన్, తుపాకి, కత్తి... ఈ కథలన్నీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూనే తిరుగుతుంటాయ్. సమకాలీన సమస్యలతో సంబందం లేకుండా తయారు చేసుకున్న కథల్లో ‘గజిని’మాత్రం సూపర్ హిట్.

ఓ మానసిక రోగి గురించి ‘గజనీ’లో చెబితే... జనాల్లో ఇంటర్నల్ గా పెరుగుతున్న మానసిక రోగం గురించి ‘స్పైడర్’లో చర్చించాడు మురుగదాస్. కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకోకుండా...‘అయ్యో పాపం’ అని సానుభూతి చూపించే సైకిక్ డిజార్డర్ మనుషుల్లో మరింత పెరిగితే.. దాని ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూపించాడు.  ‘మనకు ఏ మాత్రం సంబంధం లేని మనుషులకు.. అడక్కుండా చేసే సాయంలోనే మానవత్వం ఉంటుంది’ అని సమాజానికి సందేశం ఇచ్చాడు.
అంత వరకు బాగానే ఉంది. కానీ... కథ మాత్రం ఎక్కడా నేలమీద నడవదు. విలన్ ని పట్టుకోడానికి హీరో చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే... ‘ఇది సాధ్యమేనా?’ అనిపిస్తాయ్. కొన్ని సన్నివేశాలైతే... పూర్తిగా అన్ నాచురల్ గా సాగాయ్. ఇందులో హీరో.. సాధ్యమైనంతవరకూ టెక్నాలజీతోనే పోరాటం చేస్తుంటాడు. బి, సి.. ప్రేక్షకులకు ఇదంతా అర్థమవుతుందా? అనేది ప్రశ్న. గందరగోళంగా ఫీలయ్యే, విసుక్కునే ప్రమాదం కూడా ఉంది.  మల్టీప్లక్స్  ప్రేక్షకులు మాత్రం అర్థం చేసుకుంటారేమో!.

బండరాయి దొర్లుకుంటూ జనంమీదకు వచ్చే సన్నివేశం ఒకటుంది. అది బంతిలాగా అంతదూరం దొర్లడం చూస్తుంటే... డబ్బులు దొబ్బపెట్టడానికి కాకపోతే... ఇంత హంగామా అవసరమా? అనిపిస్తుంది. క్లైమాక్స్ కి అయితే... డబ్బుల్ని మంచినీళ్లలా పారబోశారు. శిధిలాల్లో పడి ఉన్న పెద్ద పెద్ద గోడల్ని సైతం... అమాంతం పైకిలేపి విసురుకుంటుంటారు. అంతస్తుల మీద నుంచి కింద పడ్డా.. హీరో, విలన్ లకు దెబ్బలు తగలవ్. రోప్ లతో లాగడం కూడా అర్థమైపోతోంది. అంత ఖర్చు పెట్టారు.. చిన్న చిన్న విషయాలను లైట్ గా తీసుకున్నారు. దాంతో అవే పెద్దవిగా కనిపిస్తున్నాయ్. సినిమాలో విసుగైతే లేదు. మరి జనాలకు ఎక్కుతుందో లేదో చూడాలి.

మహేశ్ స్వతహాగా మంచి నటుడు. బాగా చేశాడు. అంతకు మించి ప్రత్యేకించి చెప్పుకోడానికైతే.. ఏమీ లేదు. ఎస్.జె.సూర్య కేరక్టర్ మాత్రం నిజంగా సూపర్. ఆ పాత్రను మురగదాస్ మలిచిన తీరు కొత్తగా ఉంది. సూర్య అద్భుతంగా చేశాడు. ఓ విధంగా హీరో పాత్రను కూడా డామినేట్ చేసేలా ఉంది ఆ పాత్ర. రకుల్ చాలా అందంగా కనిపించింది. అల్లరితో అలరించింది. మిగిలిన పాత్ర ధారులు కూడా బాగానే చేశారు. సాంకేతికంగా... సంతోష్ శివన్ కెమెరా వర్క్ సూపర్బ్. ప్రతి సన్నివేశం లావిష్ గా కనిపించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలాబావుంది. హరీష్ జైరాజ్ నేపథ్యం సంగీతం బావుంది. పాటలు పర్లేదనిపిస్తాయ్. సినిమా మాత్రం ఆద్యంతం రిచ్ గానే ఉంది.

టోటల్ గా చెప్పాలంటే... సరుకులో నాణ్యత ఉంది. రుచి మాత్రం తగ్గింది. నాణ్యత కావాల్సింది కొందరికే. రుచి అందరికీ కావాలి. మరి ప్రేక్షకదేవుళ్ల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

రేటింగ్: 2/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.