బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్న రానా
on Sep 4, 2017
తన సినిమా పైసా వసూల్ ప్రమోషన్స్ లో భాగంగా నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాధ్ తో సహా రానా దగ్గుబాటి టీవీ షో నం 1 యారి కి ఈ వారం అతిధిగా వెళ్లడం జరిగింది. ఇంతకు ముందు ఎపిసోడ్లు ఒక ఎత్తయితే, బాలకృష్ణ ఎపిసోడ్ మరో ఎత్తు. సినిమాలో ఎంత ఎనర్జీ ప్రదర్శించాడో, అంతకు మించి ఉల్లాసంగా కనిపించాడు బాలయ్య. ఒక స్టార్ హీరో అయివుండి, షో కి వస్తూనే పైసా వసూల్ సాంగ్ కి డాన్స్ చేసాడు. తర్వాత ఎన్నో విషయాలు రానా, పూరి తో పంచుకున్నాడు. బాలకృష్ణ గురించి మాట్లాడితే, ప్రముఖంగా వినిపించేది ఆయన కోపం. వాస్తవానికి, ఎంతో మంది ఇండస్ట్రీ వాళ్ళు, అభిమానులు బాలకృష్ణ కోపానికి గురయిన వాళ్ళే, అందులో పూరి, రానా కూడా ఉన్నారండోయ్.
పూరి తనని సెట్లో ఏమని పిలిచేవాడు అనే ప్రస్తావన వచ్చినప్పుడు, మొదట్లో తనని సర్ అని పిలిచేవాడని... ఇకనుండి అలాగే పిలిస్తే చంపేస్తానని కాస్త గట్టిగానే చెప్పానని... తనని బాల అని మాత్రమే పిలవాలని చెప్పానని... బాలకృష్ణ అన్నాడు. రానా మధ్యలో జోక్యం చేసుకొని, ఆయన తనను రెండు సార్లు కొట్టాడని ఆ సంఘటనలు వివరించాడు. నేను ఒక సారి బాలకృష్ణ గారిని సర్ అని పిలిస్తే, ఎవడ్రా నీకు సర్ అని ఒక దెబ్బ కొట్టాడని... ఇంకో సందర్భంలో బాలకృష్ణ గారిని అంకుల్ అని పిలిచినందుకు కొట్టాడని... ఆయనతో తన అనుభవాలు పంచుకున్నాడు.
అయితే, ఇదే షోలో బాలకృష్ణ, పూరి జగన్నాధ్ ని అనుకరించి అందరికీ నవ్వులు తెప్పించాడు. పూరి తనకి కథ చెప్పడానికి వచ్చినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉండింది... ఎంత ఇబ్బంది పడ్డాడు... అనే ఈ ప్రక్రియ చేసి మరీ చూపించాడు. పూరి తో సినిమా వద్దని తనకి చాలా మంది చెప్పారని బాలకృష్ణ చెప్పగా... తనకూ బాలయ్య చాలా కోపిష్టి అని సినిమా ఆలోచన విరమించుకోవాలని కొందరు వారించారని పూరి అన్నాడు... తాను ఇంకా కుర్రాడినే అంటూ బాలకృష్ణ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తానికి ఈ షో సాంతం కడుపుబ్బా నవ్వించింది.