‘పైసా వసూల్’ హిట్టా? ఫట్టా?... తెలుగు వన్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్!
on Aug 31, 2017
గంటలు గడుస్తున్న కొద్దీ ఒకటే టెన్షన్.
మునుపెన్నడూ బాలయ్య సినిమాల విడుదల విషయంలో ఎదురవ్వని టెన్షన్.
క్రితమెప్పుడూ.. పూరీ జగన్నాథ్ సినిమాల విషయంలో ఎదురుకాని టెన్షన్.
గంటలు గడుస్తున్న కొద్దీ ఒకటే టెన్షన్...
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులందరి మనసుల్లోనూ ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న ఒక్కటే. ’పైసా వసూల్’ హిట్టా? ఫట్టా? ఈ సినిమాపై ఈ స్థాయిలో ఆసక్తి నెలకొనడానికి కారణం... బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచిస్తే ఇంకా చాలా వుంది.
నిజానికి ‘పైసా వసూల్’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచే సినిమాపై అంచనాలు మొదలయ్యాయ్. ఇక స్టంపర్ చేసిన హంగామా ప్రత్యేకించి చెప్పాలా?. ఆ తర్వాత ట్రైలర్. పూర్తిస్థాయిలో పూరీ హీరోగా మారిపోయిన బాలయ్యను చూసి అభిమానులు పులకించిపోయారు.
‘అన్నా... రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి’.. ప్రస్తుతం పసిపిల్లల నోళ్లలో కూడా నానుతున్న డైలాగ్ ఇది. ‘తమ్ముడూ..నేను జంగిల్ బుక్ చూడ్లా... కానీ.. అందులో పులి నాలాగే ఉంటుందని అందరూ అంటుంటారు. అది నిజమో కాదో... మీరే చెప్పాలి’అని బాలయ్య డైలాగ్ చెబుతున్న తీరు చూస్తుంటే... నిన్నలేని స్టైల్ ఏదో.. బాలయ్యలో నిదుర లేచినట్టనిపించింది. ఆ తర్వాత రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది... పూరీ మాస్ ప్రేక్షకులందరికీ ముష్టాన్న భోజనం పెట్టబోతున్నాడని.
అయితే... బాగున్న వాటన్నింటినీ ఏర్చి కూర్చి ట్రైలర్లను తయారు చేస్తుంటారనేది ఫిలింనగర్ టాక్. మరి ఆ విధంగా చూస్తే... సినిమా పరిస్థితి ఏంటి? ‘పైసా వసూల్’ హిట్టా? ఫట్టా? ట్రైలర్స్ ద్వారా శాంపిల్ రుచి చూపించి... అభిమానుల్నే కాదు.. దురాభిమానుల్ని కూడా ఎందుకు పూరీ టెన్షన్ కి గురి చేస్తున్నాడు? అని అందరూ అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా విషయంలో ఇంకాస్త లోతుగా వెళితే... బాలకృష్ణ హిట్ తర్వాత హిట్ ఇచ్చి 23 ఏళ్లయ్యింది. ఆల్రెడీ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ రూపంలో భారీ విజయాన్ని అందుకొని ఉన్నాడు. ఆ తర్వాత వస్తున్న సినిమా ‘పైసా వసూల్’. అదే ఇప్పుడు అందరి టెన్షన్.
ఇక పూరీ... పూరీజగన్నాథ్ కి ఇప్పుడు హిట్ వాంటెడ్. ‘టెంపర్’తో హిట్ కొట్టాక... నాలుగు సినిమాలు చేశాడు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్. ఈ నాలుగూ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లాపడ్డయ్. ఇలాంటి సమయంలో బాలయ్య లాంటి సూపర్ స్టార్... పూరీకి అవకాశం ఇచ్చాడు. మరి అంతటి గోల్డెన్ ఛాన్స్ దక్కినప్పుడు ఎవరైనా శ్రమకోరుస్తారు. మరి పూరీ ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? అనేది ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.
అసలే ఇన్ని సందేహాలు ‘వైఫై’ లాగా ఈ సినిమాను చుట్టుముట్టి ఉంటే... ‘పైసా వసూల్’ నిర్మాణంలో ఉన్న సమయంలోనే పూరీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. సినిమా అంటే క్రియేటివ్ జాబ్. మనసుతో చేయాల్సిన పని. మరి అంత ఇబ్బందిలో ఈ సినిమాను సక్రమంగా, అనుకున్న రీతిలో పూర్తిచేయగలిగాడా? అనేది చాలామంది అనుమానం.
వీటన్నింటి మధ్య రేపు ‘పైసా వసూల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రేపు ఈ సినిమా ఎలా ఉండబోతోంది. అనే విషయాన్ని మీ కోసం ముందే తెలియజెప్పబోతోంది ‘తెలుగు వన్’. అదెలాగ? అనుకుంటున్నారా?
విడుదలకు ముందే... సినిమా చూసిన కొందరి నుంచి అభిప్రాయాలను, ముఖ్యంగా సెన్సార్ సభ్యుల అభిప్రాయాలనూ సేకరించింది కాన్ఫిడెన్షియల్ గా కాన్ఫిడెంట్ గా మీకు రియల్ రిపోర్ట్ ఇవ్వబోతోంది ‘తెలుగు వన్’. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాత మేం తేల్చిచెబుతున్న విషయం ఏంటంటే.....
‘పైసా వసూల్’ సూపర్ హిట్. ఇది కేవలం ‘తెలుగు వన్’ మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా.. కాన్ఫిడెన్షియల్ గా చెబుతున్న విషయం. అభిమానులూ... రేపటి దాకా కాదు. ఈ రోజు నుంచే మీకు పండగ మొదలైంది. ఇంకెందుకు ఆలస్యం... ఎంజాయ్.