పడి లేచిన కెరటాలు (‘గౌతమ్ నంద’ స్సెషల్)
on Jul 27, 2017
ఒక్కోసారి మనం అనుకున్న ప్రదేశానికి చేరనీయకుండా... ఊహించని అవరోధాలు ఎదురవుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? మరో దారి వెతుకుతాం. ఆ దిశగా వాహనాన్ని తిప్పుకొని... ఎలాగొలా అనుకున్న ప్రదేశానికి చేరతాం. ఇలాంటి అనుభవం దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఉంటుంది.
జీవితంలో మనం అందుకోవాలనుకునే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి అవరోధాలే ఎదురవుతుంటాయ్. అప్పుడు కూడా మనం వేరే దారి వెతకాలి. ఎలాగైనా లక్ష్యాన్ని చేరాలి. ఈ రంగం ఆ రంగం అని కాదు. ఏ రంగానికైనా వర్తించే విషయం ఇది. ముఖ్యంగా సినిమా రంగానికి.
ఉదాహరణకు మన గోపీచంద్ నే తీసుకోండి. ‘తొలివలపు’(2001)తో హీరో అయ్యాడు. పాపం... కాలం కలిసి రాలేదు. అయినా వెనక్కు తగ్గాడా..! ఎన్నిసార్లు పడి లేచాడూ? ఎన్ని విధాలుగా కెరీర్ ని మౌల్డ్ చేసుకున్నాడు? ‘హీరో’ అనిపించుకోడానికి ఎన్ని దారులు వెతికాడు? ఏది ఏమైనా ‘హీరో’ అవ్వాలని గట్టిగా అనుకున్నాడు... అయ్యాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోల్లో గోపిచంద్ కూడా ఒకడు. అందులో సందేహమే లేదు. ‘గౌతమ్ నంద’ సినిమాపై నెలకొన్న అంచనాలే అందుకు నిదర్శనం.
గోపిచంద్ కంటే ముందు కూడా ఇలా పడిలేచిన కెరటాలు కొన్ని ఉన్నాయి. వారిలో మనం చెప్పుకోవాల్సిన ముందు పేరు టి.ఎల్.కాంతారావు. హెచ్.ఎం.రెడ్డిగారి ‘నిర్దోషి’(1951)ఆయన తొలి సినిమా అయినా.. జనాల దృష్టిలో ఆయన పడ్డది మాత్రం ‘ప్రతిజ్ఞ’(1953) సినిమాతోనే. దానికి కూడా హెచ్.ఎం.రెడ్డే దర్శకుడు. సినిమా పెద్ద ఫ్లాప్.
నిజానికి కాంతారావు సినీరంగానికొచ్చింది హీరో అవుదామని. ఆయన ఆకాంక్షను నిజం చేస్తూ... రెండో సినిమాతోనే కాంతారావుని హీరోను చేశారు హెచ్.ఎం.రెడ్డి. కానీ ఏం లాభం. కాలం కలిసి రాలా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు ముఖం చాటేశాయ్. దాంతో భుక్తి కోసం ఎన్టీయార్ తమ్ముడిగా, ఏఎన్నార్ అన్నగా, లేక... విలన్స్ తొత్తుగా ఇలా చిన్న చితకా వేషాలు వేయాల్సొచ్చింది. దాదాపు అలా ఓ 20 సినిమాలు చేసుంటారు. ఎట్టకేలకు విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘కనకదుర్గ పూజా మహిమ’(1960) చిత్రం కాంతారావు ఆశను నెరవేర్చింది. సోలో హీరోగా ఆయన తొలి బ్లాక్ బస్టర్ హిట్ అది. ఇక అప్పట్నుంచి వెనక్కు తిరిగి చూడలేదు. ఎన్టీయార్ తర్వాత అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన స్టార్ హీరోగా ఎదిగారు.
కృష్ణంరాజు కెరీర్ కూడా దాదాపు ఇలాగే సాగింది. తొలి సినిమా ‘చిలక గోరింక’(1966) లో ఆయనే హీరో. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో దారుణమైన డిజాస్టర్. ఆ సినిమా పుణ్యమా అని కృష్ణంరాజుకు ఉన్న అవకాశాలు కూడా పోయాయి. దాంతో... దాదాపు ఎనిమిదేళ్ల పాటు సెకండ్ గ్రేడ్ వేషాలు వేయాల్సొచ్చింది. ఇక లాభం లేదనుకొని ధైర్యం చేసి‘కృష్ణవేణి’(1974)చిత్రాన్ని ఆయనే నిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకుడు. ఆ సినిమాతో కృష్ణంరాజు దశ తిరిగింది. ఓ విధంగా సాహసం చేసి హీరోగా నిలబడ్డారు రెబల్ స్టార్.
‘గౌతమ్ నంద’సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో... గోపిచంద్ కెరీర్ గురించి కూడా మనం కాసేపు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తీసిన ఆరు సినిమాలతోనే జాతి గర్వించదగ్గ దర్శకునిగా ఎదిగిన టి.కృష్ణ కుమారుడు గోపిచంద్. కానీ... ఏం లాభం.. గోపిచంద్ చిన్నప్పుడే టి.కృష్ణ అర్థాంతరంగా చనిపోయారు. టి.కృష్ణ బతికున్నంతవరకూ నిర్మాతలతో, సినిమా జనాలతో కళకళ లాడిన ఇల్లు ఆయన మరణంతో బోసిపోయింది. పలకరించే నాధుడు లేడు. ఎత్తుకొని ముద్దు చేసిన నిర్మాతలు కూడా తప్పుకొని తిరిగారు. అలాంటి సమయంలో టి.కృష్ణ మిత్రుడైన పోకూరు బాబూరావు గోపిచంద్ కి అండగా నిలిచాడు. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ ‘తొలివలపు’చిత్రాన్ని నిర్మించాడు. అప్పటికీ కాలం కలిసిరాలేదు. సినిమా పెద్ద ఫ్లాప్. దాంతో మళ్లీ మనిషి రోడ్డున పడ్డాడు.
అయినా... గోపిచంద్ భయపడలేదు. విలన్ గా తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు. మహేశ్ బాబు ‘నిజం’చిత్రంలో విలన్ గా గోపిచంద్ నటనకు జనాలు సాహో... అన్నారు. ఆ తర్వాత వచ్చిన జయం, వర్షం చిత్రాలు గోపిచంద్ ని స్టార్ విలన్ ని చేశాయి. సో... స్టార్ అయ్యాడు. ఇక హీరో అవ్వడమే తరువాయి. మళ్లీ పోకూరు బాబూరావే... ఆయనతో మలి ప్రయత్నంగా ‘యజ్ఞం’తీశాడు. సినిమా బంపర్ హిట్. ఇక నాటి నుంచి నేటి వరకూ తను వెనుదిరిగి చూసిందిలేదు. రణం, లక్ష్యం, లౌక్యం, ఒక్కడున్నాడు, శౌర్యం, సాహసం, గోలీమార్... ఇలా మంచి మంచి సినిమాలను చేసుకుంటూ ‘హీరో’గా ముందుకెళ్తున్నాడు గోపీచంద్. ఓ విధంగా అతనో పడిలేచిన కెరటం.
ఈ శుక్రవారం సంపత్ నంది దర్శకత్వంలో గోపి నటించిన ‘గౌతమ్ నంద’ విడుదల కానుంది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ గోపి...
- నరసింహ బుర్రా