‘పైసా వసూల్’క్రేజ్ అలా ఉంది
on Jul 27, 2017
బాలయ్య సినిమాకు ‘పైసా వసూల్’ టైటిల్ ఏంటి? విడ్డూరం కాకపోతేనూ!.. చాలామంది అభిప్రాయం ఇది. మరంతే... అందరిలాగా ఆలోచిస్తే... తను పూరీ జగన్నాథ్ ఎందుకవుతాడు. పూరీ స్టయిల్ అలాగే ఉంటుంది మరి. పైసలు ఎక్కువ ఖర్చు కానీయడు... పైసలు ఎక్కువ పోనీయడు. పైసలొచ్చే సినిమా చేశాడా...! ఇక బాక్సాఫీస్ బద్దలే. పూరి జగన్నాథ్ అంటేనే మాస్. ఇక బాలయ్య అంటే... ‘ఊర మాస్’. వీరిద్దరికీ సరిగ్గా కుదిరిందంటే మాత్రం వసూళ్ల సునామీనే వేరే చెప్పాలా? పైగా ‘పైసా వసూల్’లో బాలయ్య ఫస్ట్ లుక్ కి ఎక్కడ లేని రెస్పాన్స్. ఆ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ పండగే చేసుకుంటున్నారంటే నమ్మండి. అందుకేనేమో... బయ్యర్లు ‘పైసా వసూల్’కి ఎగబడుతున్నారు. నైజాం రైట్స్ అయితే... ‘గ్లోబల్ సినిమా’ వారు ఫ్యాన్సీ ఆఫర్ తో దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లాంటి భారీ విజయం తర్వాత రానున్న సినిమా అవ్వడంతో... అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి.
ప్రస్తుతం నడుస్తున్న డ్రగ్స్ వ్యవహారం కూడా ఈ సినిమా వసూళ్లను పెంచే అవకాశం ఉందని కొందరి వాదన. అదెలాగంటారా? ఈ సినిమా మూడొంతులు పైగా పూర్తయిందనగా... ఈ డ్రగ్స్ రచ్చ మొదలైంది. మరి పూరీ సినిమాను ఎలా తీసుంటాడు? అనే ఆసక్తి జనాల్లో ఉంటుంది కదా. ఆ ఆసక్తే సినిమా వసూళ్లు పెరగడానికి కారణం అవుతుందని కొందరి అభిప్రాయం. ఇక సినిమా బావుంటే చెప్పేదేముంది? పైగా బాలయ్య సినిమా. త్వరలోనే అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను అభిమానుల సమక్షంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు భవ్య క్రియేషన్స్ అధినేత, చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ తెలిపారు. శ్రియ, ముస్కన్ , కబీర్ బేడీ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.