యువత ఎంజాయ్ మెంట్లు వదులుకోవద్దు
on Jul 21, 2017
అనుభవానికి మించిన గురువు ఉండరంటారు. జీవితంలో సంభవించే ప్రతి విషాదపు సూర్యాస్తమయం మనిషికి ఓ పాఠమే అంటారు. ట్రాఫిక్ అవైర్నెస్ ప్రొగ్రామ్ లో అల్లు అర్జున్ ప్రసంగం... దాదాపు ఈ విషయంపైనే నడిచింది. తన జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలను ఈ వేదిక సాక్షిగా ఏకరువు పెట్టాడు బన్నీ. సినిమాల్లో తన పాత్రల ద్వారానే కాదు... ప్రసంగం ద్వారా కూడా ప్రజల్ని మెస్మరైజ్ చేయగలను అని నిరూపించుకున్నాడు. వేదికపై బన్నీ నిలబడే తీరు, ఆ స్మైలింగ్ ఫేస్ అందరికీ నచ్చేసింది. వాక్చాతుర్యంతో మెప్పిస్తూ... చిన్న చిన్న జోకుల్తో జనాన్ని మురిపిస్తూ... తాను ఒక అతిధిగా కాకుండా... జనాల్లో ఒకడిగా మారిపోయి మాట్లాడాడు బన్నీ.
ప్రజల ప్రవర్తన బట్టి దేశం అభ్యున్నతి ఆదారపడి ఉంటుందని చెబుతూ... ‘ఫలానా దేశంలో ప్రజలు ఎలాంటి వారు?’ అనే విషయం తెలుసుకోవడానికి ముఖ్యంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనీ... అందులో మొదటిది టాయిలెట్ అయితే... రెండోది ట్రాఫిక్ అనీ... టాయిలెట్ ని వాడే విధానంలో, ట్రాఫిక్ నిబంధనలను పాటించే తీరు లో... మన కేరక్టర్ ఏంటో తెలుస్తుందనీ.. అందుకే భారతీయుడు కేరక్టర్ కలవాడని ప్రపంచానికి తెలియాలంటే... ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బన్నీ చెప్పారు. యువతరం ఎంజాయ్ మెంట్లు వదలుకోవద్దని చెబుతూనే... మందునీ, వాహనాన్నీ ఒకేసారి నడపొద్దని తన జీవితానికి సంబంధించిన పలు ఉదాహరణలు చెప్పుకోచ్చాడు బన్నీ.
అంత చక్కగా మనసుల్లోకి చొచ్చుకుపోయేలా మాట్లాడే తీరులో.. బన్నీలోని ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కారెక్కి స్టీరింగ్ చేత పట్టుకోగానే... నేను మనసులో అనుకునే మాట ఒక్కటే ‘నా చేతిలో ఉన్నది స్టీరింగ్ కాదు... ఎదుటివారి జీవితం’ అన్న బన్నీ మాట...యువతరం హృదయాల్లో బాగానే నాటుకుంది. సినిమా హీరోల ప్రభావం యువతరం మీద ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక బన్నీ విషయానికొస్తే.. తను ఇప్పుడు చాలామంది కుర్రాళ్లకు రోల్ మోడల్.
హీరో అంటే కేవలం వినోదాన్ని పంచడమే కాదు... యువతరంలో ఆదర్శభావాలను కూడా నింపాలి. అప్పుడే వాళ్లు రియల్ హీరోలవుతారు. బన్నీ... ఈ ట్రాఫిక్ అవైర్నెస్ కార్యక్రమానికి హాజరై... యువతరానికి ఉపయోగపడే మాటలు చెప్పి మెప్పించి, ఒప్పించడంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.