బాలకృష్ణ నిజంగానే ఒప్పుకున్నాడా?
on Jul 5, 2017
నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రం కన్నా కూడా తన తండ్రి నందమూరి తారక రామ రావు జీవిత చరిత్రనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా ఎన్టీఆర్ బయోపిక్ గురించే మాట్లాడుతున్నాడు. ఇంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎవరయినా అనుభవం ఉన్న లేదా అందరికీ మెచ్చేలా తీసే దర్శకుడి చేతిలో పెడతాడు అని అనుకున్న అభిమానులకి, రామ్ గోపాల్ వర్మ నిన్న విడుదల చేసిన ప్రకటన ఒకింత అసహనానికి గురి చేసింది. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడి చేతిలో పెట్టారేంటి అని అభిమానులు అభ్యంతరం చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరి సందేహం ఏంటంటే ఇంతకీ బాలకృష్ణ ఆర్జీవీ ని నిజంగానే ఓకే చేశాడా లేక అతడే అడ్వాన్స్ అయి ప్రకటన ఇచ్చుకున్నాడా అని.
ఎందుకంటే బాలకృష్ణ ఇప్పటి వరకు వర్మ విషయంలో నోరు మెదిపింది లేదు. అసలు బాలకృష్ణ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? అతడికి వేరే ఇంకేదయినా ఆలోచన ఉందా? లేక ప్రెస్ మీట్ ద్వారా తన అభిప్రాయం వ్యక్త పరుస్తారా? ఇవి అభిమానుల మదుల్లో మెదులుతున్న ప్రశ్నలు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, వర్మ నిన్న విడుదల చేసిన ప్రకటనలో బాలకృష్ణ గురించి ఒక మాట కూడా ప్రస్తావన చేయక పోవడం. ఇవన్నీ పక్కన పెడితే, ఎన్టీఆర్ జీవిత గాథ ని తెరకెక్కించే సత్తా వర్మ కి ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనవసర విషయాల్ని వివాదం చేసి, అవసరమయిన విషయాల్ని పక్కన పెడతాడనే అభిప్రాయం ఉంది. అయినా, తెలుగులో వర్మ కాకుండా ఇంకే దర్శకుడూ ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి ముందుకు రావడం లేదా అని నందమూరి అభిమానులు వాపోతున్నారు. చూద్దాం బాలకృష్ణ మనసులో ఏముందో అది ఎప్పుడు బయట పెడతాడో!