హిరణ్యకసిపునిగా భల్లాలదేవుడు?
on Jul 4, 2017
కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సి.పుల్లయ్య, పి.పుల్లయ్య తరం తర్వాత తెలుగు తెరపై పౌరాణికాలు గణనీయంగా తగ్గాయి. అయితే... భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు మళ్లీ ఇప్పటి దర్శకులు పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల వైపు మక్కువ చూపించడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇప్పుడున్న దర్శకుల్లో పూర్తిస్థాయి పౌరాణికాన్ని తీసిన క్రెడిట్ మాత్రం గుణశేఖర్ దే అనాలి. జూనియర్ ఎన్టీయార్ ని తెరకు పరిచయం చేస్తూ అందరూ బాలలతో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ఇప్పటికీ వండరే. ‘రుద్రమదేవి’లాంటి చారిత్రాత్మక చిత్రం కూడా తెరకెక్కించి ఆ దిశగా కూడా క్రెడిట్ కొట్టేశాడు గుణశేఖర్. పలు సోషల్ చిత్రాలకు కూడా దర్శకుడైన గుణశేఖర్ కు ఇక మిగిలింది ‘జానపదం’ఒక్కటే. అయితే ‘బాహుబలి’లాంటి జానపద చిత్రం వచ్చిన తర్వాత మళ్లీ అంత త్వరగా ఎవరో జానపదం జోలికి ఏ దర్శకుడు వెళ్లడు. అందుకేనేమో గుణశేఖర్ మళ్లీ దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తిస్థాయి పూర్తిస్థాయి పౌరాణికాన్ని తెరకెక్కించనున్నారు.
ఆ సినిమా పేరే ‘హిరణ్య కశిప’. శ్రీమద్భాభాగవతంలోని నరసింహావతారం నేపథ్యంలో సాగే కథ ఇది. నరసింహస్వామి చేతిలో చంపబడ్డ రాక్షసుడు హిరణ్యకసిపుడ్ని హీరోను చేసి ఈ సినిమా చేస్తున్నాడు గుణశేఖర్. గతంలో దుర్యోధనుడ్ని, రావణాసురిడ్ని హీరోలుగా చూపిస్తూ ఎన్టీయార్ సినిమాలు తీసి ప్రేక్షకులతో వహ్వా అనిపించుకున్నారు. ఇప్పుడు గుణశేఖర్ కి కూడా అదే ఇన్ స్పిరేషన్ కావొచ్చు. ఇంతకీ ఇందులో హిరణ్యకసిపునిగా కనిపించేది ఎవరా అనుకుంటున్నారా! మరెవరో కాదు మన భల్లాలదేవుడే! అవును... దగ్గుబాటి రానా హిరణ్యకసిపునిగా కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే... ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.