'బాహుబలి-2' చిన్న పిల్లలకు నో ఎంట్రీ ?
on May 16, 2017
'బాహుబలి-2' ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుండడం తెలిసిందే. మిగతా దేశాల్లోలానే ఈ చిత్రం సింగపూర్ లో కూడా సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఈ చిత్రంలో హింస మరీ ఎక్కువగా ఉందని, ఆ దేశంలో ఈ చిత్రాన్ని 16 ఏళ్ళ లోపు చిన్న పిల్లలు చూడడాన్ని నిషేధించారని తెలుస్తోంది. మన దేశంలో కూడా 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వబడిన సినిమాలు 16 ఏళ్ళ లోపు పిల్లలు చూడకూడదు. కాకపోతే.. ఈ నిబంధనను మనవారెవరూ పాటించరంతే.
కానీ సింగపూర్ లో అలా కాదు. అక్కడ రూల్ అంటే రూలే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అతిక్రమించరు. ఇక 'బాహుబలి-2' చిత్రంలోని హింస విషయానికి వస్తే.. ఈ చిత్రంలో జరిగే పలు పోరాట సన్నివేశాల్లో వందలాదిమందిని ఊచకోత కోసినట్లుగా ఉంటుంది. అలాగే.. దైవ దర్శనం కోసం వెళ్లిన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన సైనికాధికారి తలను ప్రభాస్ నిర్దాక్షిణ్యంగా కోసేస్తాడు. అందువల్ల.. ఈ చిత్రాన్ని చిన్న పిల్లలు చూడకూడదని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. చూడొద్దన్నవి చూడడమంటే యువతరానికి మహా సరదా కాబట్టి.. ఈ చిత్రానికి మరింత క్రేజ్ రావడం ఖాయం !!