మాఫియా డాన్ కొడుకు రజినీకాంత్ కి నోటీస్ పంపాడు!
on May 13, 2017
రజినీకాంత్ కి లీగల్ నోటీస్ వచ్చింది! అరెరె… ఆయనేం తప్పు చేశాడూ అంటారా? తప్పు చేయబోకండీ అంటూ ఒకాయన నోటీస్ పంపించాడు. అంత ముందు జాగ్రత్త వున్న ఆయనెవరో మామూలోడు కాదు. అలాగని అందరికీ తెలిసిన వాడు కూడా కాదు. తమిళనాడు నుంచీ ముంబై వెళ్లి డాన్ గా ఎదిగిన హజీ మస్తాన్ అనే మాఫియా లెజెండ్ తనయుడట! ఆయన రజినీకి నోటీస్ పంపించేటంత సమస్యేం వచ్చిందో తెలుసా?
ఈ మధ్య పెద్ద పెద్ద సార్ట్స్ , డైరెక్టర్స్ ఏ సినిమా మొదలు పెట్టినా వెంటనే గొడవలు, గోలలు మొదలైపోతున్నాయి. మొన్నటికి మొన్న మన బాహుబలికి కూడా కన్నడ సినిమా రంగంలో కష్టాలు ఎదురయ్యాయి. కట్టప్ప తమకు క్షమాపణ చెబితే తప్ప బాహుబలిని రానివ్వం అంటూ భీష్మించారు కర్ణాటక వాళ్లు! ఇప్పుడు అదే తరహాలో రజినీ మూవీకి కూడా నోటీస్ ఇబ్బందులు మొదలయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే.. ఇంకా సదరు సినిమా మొదలూ కాలేదు. అసలు కన్ ఫర్మ్ కూడా కాలేదు!
ప్రస్తుతం శంకర్ తీసిన రోబో 2.0 విడుదల హడావిడిలో వున్న తలైవా నెక్ట్స్ మూవీ పా రంజీత్ తో చేయనున్నాడని టాక్. కబాలీ తీసిన పా రంజీత్ ఈ సారి సూపర్ స్టార్ తో ముంబై మాఫియా డాన్ హజీ మస్తాన్ జీవిత చరిత్ర చేయనున్నాడట. ఆయన తమిళనాడు నుంచీ ముంబై వెళ్లి డాన్ గా తన స్వంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. కాని, అదంతా ఒట్టి ట్రాష్ అంటున్నాడు సుందర్ శేఖర్! మధ్యలో ఈయనెవరూ అనుకోకండీ… అతనే హజీ మస్తాన్ కొడుకట!
సుందర్ శేఖర్ తన తండ్రి హజీ మస్తాన్ డాన్ కాదనీ, అతడ్ని చెడుగా చూపవద్దని రజినీకాంత్ కి నోటీస్ పంపాడు. అంతే కాదు, తాను స్వయంగా సినిమా ప్రొడ్యూసర్ ని అన్న ఆయన … తండ్రి మస్తాన్ పైన తానే సినిమా తీస్తాడట! నోటీస్ అందిన మాటైతే నిజమే కాని… ఇంకా దళపతి దీనిపై ఏం స్పందించలేదు. ఎందుకంటే, పా రంజీత్ తో హజీ మస్తాన్ బయోపిక్ చేయటం పై ఇంకా ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు కాబట్టి. మరి ఆలూ లేదు చూలు లేదు అన్న సామెతలా … సుందర్ శేఖర్ ఇచ్చిన నోటీస్ కి … రజినీకాంత్ ఎప్పుడు స్పందిస్తాడో! అంతే కాదు… హజీ మస్తాన్ అనే తమిళాయన ముంబైలో డాన్ గా ఎదిగితే … మధ్యలో సుందర్ శేఖర్ అనే పేరుతో కొడుకు వెలుగులోకి రావటం ఏంటో.. అని కూడా చాలా మంది డౌట్ గా చూస్తున్నారు!