సమంతతో కేటీఆర్ "అంబాసిడర్" ఆట
on Apr 20, 2017
ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడాలని చాలా మంది సెలబ్రిటీలు అనుకుంటూ ఉంటారు. తమకు చేతనైనంతలో ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఒక అవకాశమే నటి సమంతకు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించారు మంత్రి కేటీఆర్. దీనికి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అయితే సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కాదంటూ కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించలేదని తెలంగాణ చేనేత, జౌళిశాఖ లిఖిత పూర్వక సమాచారం అందించింది.
దీనికి సంబంధించి విధివిధానాలు, పారితోషికం, ఒప్పందం, అపాయింట్మెంట్ లెటర్ తదితరాల గురించి మా దృష్టికి రాలేదంటూ ఆ శాఖ డైరెక్టర్ తెలిపారు..దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ స్పందించారు. చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడానికి సమంత ముందుకు రావడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారని..బ్రాండ్ అంబాసిడర్గా ఆమె ప్రతిఫలరహితంగా సేవలు అందిస్తున్నారని శైలజ అన్నారు. దీనిపై త్వరలోనే ఆమెతో అధికారికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని తెలిపారు. మరి ఈ అంబాసిడర్ ఆట ఏమవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.