చరణ్ గుండెల్లో గుబులు
on Apr 8, 2017
మణిరత్నం అంతటోడు వచ్చి కథ చెబుతానంటే, సినిమాలో నువ్వే హీరో అంటే.. `నో` చెప్పడానికి ఎవ్వరికైనా ధైర్యం ఉంటుందా?? మణిరత్నం ఫ్రేమ్‌లో కనిపించడమే గొప్ప భాగ్యం అని మురిసిపోతారు. రామ్ చరణ్ అదే చేశాడు. తన కెరీర్లో అదో అద్భుతమైన అవకాశం అని సంబరపడిపోయాడు. మణిరత్నం అడగ్గానే కాల్షీట్లు ఇచ్చేశాడు. దేశం గర్వించదగిన దర్శకుడితో సినిమా చేస్తున్నా.. అని చాలాసార్లు చెప్పాడు. అయితే అదే రామ్ చరణ్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే.. తాజాగా మణి నుంచి వచ్చి సినిమా `చెలియా` డిజాస్టర్ అని తేలిపోయింది.
ఈ సినిమా చూసి `ఇది మణిరత్నం సినిమాయేనా` అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓకే బంగారంతో మళ్లీ తన మాయ చూపించిన మణి... ఇప్పుడు ఇలా చేతులెత్తేశాడేంటి?? అంటూ తెగ ఫీలైపోతున్నారు. అందరిదీ ఓ బాధైతే చరణ్‌కి మరో బాధ. ధృవ సినిమాతో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చాడు. సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే మణిరత్నం సినిమా మొదలెట్టాలి. చెలియా రిజల్ట్ చూస్తే ఎవ్వరికైనా కంగారు ఖాయం. మరి.. ఏదైనా ఫర్లేదు మణిరత్నంతో సినిమా చేయాల్సిందే అని కమిట్ అయిపోతాడా, లేదంటే... ఏదో ఓ సాకు చెప్పి మెల్లగా జారుకొంటాడా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. చరణ్ `నో` అంటే... ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టే.
Also Read