ట్రైలర్ రివ్యూ: బాహుబలి-2
on Mar 16, 2017
తెలుగు సినిమాతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న "బాహుబలి ద కన్‌క్లూజన్" ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాళ భాషల్లో బాహుబలి-2 ట్రైలర్లు విడుదలయ్యాయి. రమ్యకృష్ణ కాలిని తాకుతూ మాహిష్మతి సామ్రాజ్య బాధ్యతలను స్వీకరిస్తూ ప్రభాస్ ప్రమాణ చేసే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ పార్ట్‌లో కారాగారానికే పరిమితమైన అనుష్క అమరేంద్రుడితో కలిసి రోమాన్స్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య ఒక లిప్ లాక్ కూడా పెట్టినట్లున్నాడు జక్కన్న.
అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా "నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు" అంటూ ప్రభాస్ ఆవేశంతో డైలాగ్ చెప్పడం ద్వారా సినిమాలోనే ఈ పజిల్‌కు సమాధానం వెతుక్కోమన్నాడు రాజమౌళి. సోషల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ థియేటర్లలో ట్రైలర్‌ని ప్రదర్శించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తుండగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-2ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.