అన్నగారి కథలో అక్కినేని ఎవరు?
on Feb 7, 2017
టాలీవుడ్ లో మరో బయోపిక్ రూపుదిద్దుకోవడానికి రంగం సిద్ధం అవుతోంది. తెలుగు జాతి కీర్తినీ, ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అన్న ఎన్టీఆర్ కథ ఇప్పుడు వెండి తెరపై సినిమాగా రాబోతోంది. ఆ కథలో, అన్న పాత్రలో కనిపించేది నేనే అంటూ ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా ప్రకటించేశారు. సరైన సినిమాకి సరైన నటుడు దొరికాడు. అన్న పాత్రలో అభిమానులు కూడా బాలయ్యని తప్ప ఇంకెవ్వర్నీ ఊహించుకోలేరేమో..? ప్రస్తుతం తన 101 వ సినిమా కోసం కథల కోసం అన్వేషిస్తున్న బాలయ్యకు 102వ సినిమా కథా వస్తువు రెడీ అయిపోయినట్టే. అన్న కథంటే మాటలా?? చాలా చాలా విషయాలు చెప్పాలి. అందులో సినిమా జీవితం అతి ముఖ్యభాగం.
ఆ ఎపిసోడ్లో కచ్చితంగా అలనాటి దిగ్గజ నటుల ప్రస్తావన ఉండాల్సిందే. అందులోనూ అక్కినేని నాగేశ్వరరావుని తప్పకుండా చూపించాలి. ఎన్టీఆర్- ఏఎన్నార్లతో దాదాపు 30 మల్టీస్టారర్ చిత్రాలొచ్చాయి. అన్నీ హిట్సే. వాళ్లిద్దరి మధ్య అనుబంధం కూడా అంత ధృడంగా ఉండేది. మరి.. అక్కినేని పాత్రలో ఇప్పుడు ఎవరు కనిపిస్తారు? ఆ స్థాయి ఎవరికి ఉంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటు నందమూరి బాలకృష్ణకు కూడా ఏఎన్నార్ అంటే ఇష్టమే. `బాబాయ్` అంటూ ఆప్యాయంగా పలకరించేవారు అక్కినేనిని. ఎన్టీఆర్ పాత్రని బాలయ్య చేసినట్టుగా, ఏఎన్నార్ పాత్రలో నాగార్జున చేస్తే అద్భుతంగా ఉంటుంది.
కానీ... బాలయ్యకూ, నాగార్జునకూ సత్సంబంధాలు లేవు. ఇద్దరి మధ్యా ఏదో విషయంలో గొడవ జరిగిందని, అది.. వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచిందని, ఇప్పటికీ వీరిద్దరూ పలకరించుకోరని టాలీవుడ్ టాక్. సో.. అక్కినేని పాత్రలో నాగార్జున నటించే ఛాన్సులే లేవన్నమాట. మరి నాగ్ ప్లేసులోకి ఎవరొస్తారు? వచ్చినా ఆ స్థానం భర్తీ అవుతుందా? అనేవి ప్రస్తుతం నందమూరి అభిమానుల్లో రేగుతున్న ప్రశ్నలు. తమ మధ్య ఈగో గోలల్ని వదిలేసి, నిజంగానే బాలయ్య, నాగ్ కలసి నటిస్తే.. అది అద్భుతమే అవుతుంది. మరి ఆ ఆనందాన్ని వీరిద్దరూ టాలీవుడ్‌కి మిగులుస్తారా? వెయిట్ అండ్ సీ.