సుక్కు.. చరణ్ కథ లీకైపోయిందోచ్!
on Feb 6, 2017
ధృవతో ఫామ్ లోకి వచ్చాడు రామ్ చరణ్. ఇప్పుడు సుకుమార్ సినిమాని మొదలెట్టేసే మూడ్‌లో ఉన్నాడు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కథ గురించీ టైటిల్ గురించీ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని ముందు నుంచీ చిత్రబృందం చెబుతూనే ఉంది. రేపల్లె, పల్లెటూరి మొనగాడు అనే పేర్లు ఈసినిమా కోసం పరిశీలిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో రామ్ చరణ్ చెవిటివాడి పాత్ర పోషిస్తున్నాడు. పల్లెటూర్లో ఉండాల్సిన కథానాయకుడు.... ఓ సందర్భంలో పట్నానికి వెళ్లాల్సి వస్తుందట. అక్కడ కథానాయకుడిపై ఓ శాస్త్రవేత్త ప్రయోగానికి పూనుకొంటాడట. అక్కడి నుంచి కథానాయకుడి శరీరంలో విపరీతమైన మార్పులు వస్తుంటాయట. ఆ తరవాత ఏం జరిగింది? కథానాయకుడి కథ ఎలా మలుపు తిరిగింది? అనేది ఆసక్తికరమని తెలుస్తోంది. సుకుమార్ సినిమాల్లో సూత్రాలు, సైన్స్ ఈక్వేషన్లూ కనిపిస్తాయి. రామ్ చరణ్ సినిమాలోనూ వాటి ప్రభావం ఎక్కువగానే ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ లీకైన కథ ఎంత వరకూ కరెక్టో, చలామణీలో ఉన్న ఆ టైటిళ్లలో ఏది నిజమైనదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.