వంగవీటి..గురితప్పిన "రామూ"బాణం
on Dec 25, 2016
వంగవీటి... వర్మ కెరీర్లో మొదటి బయోపిక్! కాని, థియేటర్ కి వెళ్లి వచ్చిన వారు అది బయోపిక్ కాదు భయంకరమైన పిక్ అంటున్నారు! వంగవీటి మోహన రంగ నిజ జీవిత గాథని తెరకి ఎక్కిస్తానని చెప్పిన రామూ ఆ పని చేసేశాడు. కాని, ఈ మధ్య కాలంలో తన అన్ని సినిమాల మాదిరిగానే దీన్ని కూడా చకచకా చుట్ట చుట్టేశాడు. అంతే తప్ప ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. రియల్ లైఫ్ నాయకులు, రౌడీల పేర్లు యథాతథంగా వాడటం తప్ప స్టోరీ టెల్లింగ్ లో ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపలేదు...
అసలు రాము తాను డైరెక్టర్ గా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎక్కువ కష్టపడుతున్నాడని అంటున్నారు చూసినవారు! సినిమాలో ఎక్కడపడితే అక్కడ ఆర్జీవీ గొంతు వినిపిస్తుంది. అలా వినిపించకూడదని కాదుగాని... ఆయన స్థాయి వాడు చెప్పాల్సిన ఒకట్రెండు ముఖ్యమైన లైన్లు చెబితే బావుంటుంది కాని... అదే పనిగా కథంతా నరేట్ చేసేస్తూ పోతే దాన్నేమనాలి? ఇంకో అడుగు ముందుకేసి పాటలు కూడా పాడాడు వర్మ. అసలు ఆయనకి... గుర్రం పని గుర్రం, ఏనుగు పని ఏనుగూ చేయలన్న సామెత తెలుసంటారా? తెలియనట్లే అనిపిస్తుంది వంగవీటి పాటలు వింటుంటే...
ఇక వంగవీటి పేరుతో కత్తి లాంటి సినిమా తీస్తాడు మా వర్మ అనుకుంటూ వెళ్లిన ఫ్యాన్స్ ని... కత్తి లాంటి సినిమాకి బదులు కత్తులు మాత్రం ఎదురుపడి పలకరించాయి. అంబాసిడర్ కార్లు, రక్తం కారే కత్తులు... ఇవే ప్రతీ సీన్లో! విజయవాడ రౌడీ రాజకీయాల్లో హత్యలు జరిగిన మాట వాస్తవమే అయినా అవ్వన్నీ వెండితెర మీద మరోసారి చేయించి , చూపించాడు వయోలెంట్ వర్మ! ఒకప్పటి క్రియేటివ్ వర్మలా ఏ మాత్రం లోతుల్లోకి వెళ్లలేకపోయాడు. అసలు అలా వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే, ఆయన వంగవీటి మీద ఎంత శ్రద్ధ పెట్టాడంటే సినిమాలో అక్కడక్కడా జగన్ ఫ్లెక్సీలు, స్ప్లెండర్ బైక్ లు కనిపిస్తాయట! వంగవీటి మోహన రంగ జీవిత కాలం... 1980వ దశకం! అప్పట్లోనే జగన్ బొమ్మలు, స్ప్లెండర్ బైక్ లు కూడా రామూ చూపించాడంటే ఆయన కమింట్ మెంట్ అర్థం చేసుకోవచ్చు. మరో వైపు, వంగవీటి , దేవినేని వర్గాల మధ్య గొడవ జరుగుతోంటే పోలీసులే కనిపించరట సినిమాలో! కాని, రియల్ లైఫ్లో విజయవాడ పోలీస్ పాత్ర ఎంత కీలకమో 1980ల నాటి పరిస్థితులు తెలిసిన వారికి ఎరుక!
వంగవీటిలో ఎన్ని లోపాలున్నా సినిమా చూసొచ్చిన జనం ఒక్క విషయంలో మాత్రం చాలా ఆనందంగా వున్నారు! రక్త చరిత్ర మాదిరిగా ఇది రెండు పార్ట్ లు తీయలేదు. సో... వంగవీటీ 2 వుండదని సంబరపడుతున్నారు. మరి రామూ వచ్చే సినిమా చూస్తారో... ఈ వంగవీటే అర్జెంట్ వెళ్లిపోయి చూస్తారో.. మీ ఇష్టం!