పూరి పరువు తీసేసిన మాజీ సీఎమ్
on Sep 21, 2016
పూరి జగన్నాథ్కి ఇప్పుడంటే హిట్లు లేకపోవొచ్చు. కానీ పూరి అంటే ఎప్పటికీ క్రేజే. తెలుగు చిత్ర సీమ నివ్వెరపోయే సినిమాల్ని అందివ్వడంలో దిట్ట. అందుకే స్టార్ హీరోలు ఇప్పటికీ పూరీ.. పూరీ అంటూ ఆయన పేరే జపిస్తుంటారు. అలాంటి పూరి.. ఓ కొత్త హీరోకి కథ చెబితే వర్కవుట్ అవ్వకుండా ఉంటుందా?? ఆ కథ నచ్చలేదు అని పూరి ని పక్కన పెట్టేయడం జరుగుతుందా? కథదే ముంది? పూరితో సినిమా చేస్తే చాలు అనుకొని రంగంలోకి దిగిపోతారు. కానీ... ఈ సీన్ పూర్తిగా రివర్స్లోజరిగింది. పూరి కథని పక్కన పెట్టి ఓ కొత్త హీరో షాక్ ఇచ్చాడు.
కర్నాటక మాజీ సీఎమ్ కుమారస్వామి తనయుడు నిఖిల్ కోసం కథలు వింటున్నప్పుడు పూరికీ పిలుపొచ్చింది. పూరి వెళ్లి ఓ కథ కూడా చెప్పాడు. ఓ కొత్త కుర్రాడితో పూరి సినిమా తీయడం కచ్చితంగా ఆ సినిమాకి హైప్ తెచ్చే పాయింటే. కానీ కుమారస్వామి మాత్రం.. `ఈ కథ బాగోలేదు..` అంటూ పక్కన పెట్టేశాడట. దాంతో పూరి ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయాన్ని కుమార స్వామినే స్వయంగా వెళ్లడించడం విశేషం. పూరితో సినిమా చేద్దామనుకొన్న మాట వాస్తవమే. అయితే ఆయనచెప్పిన కథ మాకు నచ్చలేదు. అందుకే వద్దన్నాం అంటూ ఓ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి పూరి పరువు తీసి పారేశాడు మాజీ సీఎమ్. పూరి దగ్గర కథల స్టాకు అయిపోయిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?