English | Telugu

తిక్క మూవీ రివ్యూ

on Aug 13, 2016

రివ్యూ :  తిక్క‌

పొగ‌త్రాగ‌డం, మ‌ద్య‌పానం హానిక‌రం అని సినిమా ప్రారంభానికి ముందు హెచ్చ‌రిస్తుంటారు. కొన్ని సినిమాలు అంత‌కంటే ప్ర‌మాదం... కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్టు టికెట్ కొని మ‌రీ త‌ల‌నొప్పి తీసుకొచ్చుకొంటాం. థియేట‌ర్‌లోకి అడుగుపెట్టిన కాసేప‌టికే.. ''ఈ సినిమాకి ఎందుకొచ్చాంరా బాబూ..'' అనిపించే అద్భుత‌మైన క‌ళాఖండాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమాల లిస్టు రాయాల‌ని పూనుకొంటే క‌చ్చితంగా చేర్చాల్సిన సినిమా పేరు.. తిక్క‌. స్క్రిప్టు రాశాక.. త‌న తిక్క‌కు ముచ్చ‌ట‌ప‌డి ఈ సినిమాకి తిక్క అని పేరు పెట్టుకొన్నాడా?  లేదంటే తిక్క అని పేరు పెట్టాం కాబ‌ట్టే ఈ సినిమాని తిక్క తిక్క‌గా తీసేద్దాం అని డిసైడ్ అయ్యారో తెలీదు గానీ.. సినిమా చూశాక మాత్రం ఆడియ‌న్స్‌కు తిక్క రేగ‌డం ఖాయం. ఇంతకీ ఈ తిక్క క‌థేంటి... దాని క‌మామిషూ ఏంటి?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాలి.

* క‌థ‌

ఆదిత్య (సాయిధ‌ర‌మ్‌తేజ్‌) ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. అమ్మాయిల‌తో కాల‌క్షేపం, స్నేహితుల‌తో మందు కొట్ట‌డం, ప‌బ్బూ, పేకాట‌.. ఇలా లేని అవ‌ల‌క్ష‌ణాలంటూ లేవు. ఓ యాక్సిడెంట్‌లో యాక్సిడెంట‌ల్‌గా అంజ‌లి (ల‌రిస్సా) క‌లుస్తుంది. త‌న‌ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. అంజ‌లి కోసం త‌న చెడు అల‌వాట్ల‌న్నీ మానుకొంటాడు. పూర్తిగా మారిపోతాడు. అయితే అంజ‌లి మాత్రం ఆదిత్య‌కు బ్రేక‌ప్ చెప్పేసి మ‌రొక‌రితో పెళ్లికి ఫిక్స్ అయిపోతుంది. దాంతో పాటు.. ఉద్యోగం పోతుంది. త‌న ప్రాణ స్నేహితుడు త‌న‌ని అపార్థం చేసుకొంటాడు.  ఆ బాధలో  పార్టీ చేసుకొంటాడు ఆదిత్య‌. ఆ పార్టీలో ఫుల్లుగా తాగి ఆ బార్‌ని నాశ‌నం చేస్తాడు. పెట్రోల్ బంక్ పేలుస్తాడు. క‌ల్యాణ మండ‌పంలో ర‌చ్చ ర‌చ్చ చేస్తాడు. దాంతో పోలీసులు ఆదిత్య వెంట ప‌డ‌తారు. అస‌లు తానొక్క‌డే ఇంత రాద్దాంతం ఎందుకు చేశాడు?  తాగిన మైకంలో ఆ రాత్రి ఏం జ‌రిగింది?  అంజ‌లి ఆదిత్య‌ని వ‌దిలేసి వెళ్లిపోవ‌డానికి కార‌ణం ఏమిటి?  ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే తిక్క‌ చూడాల్సిందే. 

* విశ్లేష‌ణ‌
ఈ సినిమా మొద‌లైన ప‌ది నిమిషాల‌కే ద‌ర్శ‌కుడు క‌థ‌పై ఎలాంటి క‌స‌ర‌త్తూ చేయ‌లేద‌న్న విష‌యం అర్థ‌మైపోతుంది. సీన్ల‌ను సాగ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడే విష‌యం లేకుండా కాల‌క్షేపం చేద్దామ‌ని చూస్తున్నాడ‌ని ఈజీగా తెలిసిపోతుంది. అస‌లు ఇలాంటి స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు రాసుకొన్నందుకు, రాసినా నిర్మాత తీయ‌డానికి ధైర్యం చేసినందుకు, తీసినా... అందులో న‌టించ‌డానికి హ్యాట్రిక్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సిద్ధ‌మైపోయినందుకు ఆశ్చ‌ర్య‌ప‌డిపోవాలి. మందు పార్టీ ఎప్పుడైతే మొద‌లైందో అప్ప‌టి నుంచి పాత్ర‌లు త‌మ‌కిష్టం వ‌చ్చిర రీతిలో ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లెడ‌తాయి. మందు వాళ్లు కొట్టినా.. ఆ మైకం ప్రేక్ష‌కుల‌కు క‌మ్ముతుంది. ఆ స్థాయిలో ఉన్నాయి ఆ స‌న్నివేశాలు. పాట త‌ర‌వాత పాట వ‌చ్చి ప‌డిపోతుంది.. ఫైట్ల సంగ‌తి చెప్ప‌క్క‌ర్లెద్దు. అటు తండ్రి కిడ్నాప్ అయిపోయి, హీరోయిన్ ఎక్క‌డుందో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితుల్లో హీరో ఐటెమ్ సాంగ్ వేసుకొంటాడు చూడండీ.. ఆ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు జోహార్లు అర్పించాల్సిందే. పాట‌లున్నాయి క‌దా అని వాడేసుకొన్నాడేమో అనిపిస్తుంది.

త‌మ‌న్ కూడా ఒక సాంగు తీసుకొంటే రెండో సాంగు ఫ్రీ అని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టున్నాడు. వాటిని ఎడా పెడా వాడేశారు. తిక్క సినిమాలో రెండు కీల‌క‌మైన ఘ‌ట్టాలున్నాయి. అవి రోడ్డుపై ఛేజింగ్‌. దాన్ని క‌నీసం అర‌గంట లాగారు. బ్యాంకులో ఉన్న కోట్లు క‌రిగించ‌డానికి త‌ప్ప‌.. ఆ ఛేజింగ్ సీన్ ఎందుకూ ఉప‌యోగ‌ప‌డ‌దు.  సెకండాఫ్‌లో ఐదుగురుకి ముసుగు వేసి.. కిడ్నాప్ డ్రామాలో క‌న్‌ఫ్యూజ్ డ్రామా మిక్స్ చేసి వ‌దిలారు. ఆ స‌న్నివేశం గంద‌ర‌గోళంగా సాగుతుంది. ఈ రెండు సీన్లు చూస్తే ద‌ర్శ‌కుడి సృజ‌న‌కు జోహార్లు చెప్పాల‌న్నంత క‌సి, కోపం వ‌చ్చేస్తాయి. క‌థ‌ని అక్క‌డ‌క్క‌డ అర్థం ప‌ర్థం లేని స‌న్నివేశాల‌తో గంట‌ల కొద్దీ తిప్పి... త‌ల‌తిరిగిపోయేలా చేశారు. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

సాయిధ‌ర‌మ్ తేజ్ అత్యంత పూర్ పెర్‌ఫార్మ్సెన్స్ ఈ సినిమాలోనే చూసుంటాం. అత‌ని ఎన‌ర్జీ బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. ఇంకోలా చెప్పాలంటే సాయిలోని లోపాల‌న్నీ ఈసినిమాలో క‌నిపించాయి. డాన్సులు బాగా చేశాడు. కానీ ఆ పాట‌లే అన‌వ‌స‌రం అనుకొన్న‌ప్పుడు డాన్సుల సంగ‌తి ఎవ‌రికి కావాలి?  ల‌రిస్సా బోన్సి చూడ్డానికి బాగానే ఉంది. కానీ న‌వ్వితే మాత్రం చూడ‌లేం. ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డానికి ఇబ్బంది ప‌డింది. అందుక‌నేనేమో చివ‌ర్లో అర‌గంట పాటు ముసుగేసి తిప్పేశారు. పెట్టుడు గడ్డంతో రాజేంద్ర ప్ర‌సాద్ చాలా ఇబ్బంది పెట్టాడు. అత‌నిలాంటి న‌టుడ్ని ఎలా వాడుకోవాలో ద‌ర్శ‌కుడికి అర్థం కాలేదు. అందులో రాజేంద్ర ప్రాస‌ద్ త‌ప్పేం లేదు.  ముమైత్‌ఖాన్‌, అలీ.... ఈ సినిమాలో వీళ్లిద్ద‌రిదీ ఓ పెయిర్‌. అలీ గెట‌ప్ డిజైన్ చేసిందెవ‌రో గానీ వాళ్ల‌కు దండం పెట్టాలి. చిన్న‌ప్ప‌టి నుంచీ అలీని చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్ష‌కులు. అయితే ఇంత వికారంగా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ముమైత్ ఖాన్‌ని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాలేదు. అజ‌య్‌ని కూడా బ‌ఫూర్‌ని  చేశారు. లెక్క‌లేనంత మంది ఆర్టిస్టులు ఉన్నా.. ప్ర‌యోజ‌నం సున్నాగా మారింది. 

* సాంకేతిక వ‌ర్గం

త‌మ‌న్ నుంచి మంచి పాట‌ల్ని ఆశించ‌డం మ‌న త‌ప్పే అవుతుంది. తిక్క తిక్క తిక్క‌గున్న‌దే పాట ధ‌నుష్ గొంతు కోసం విన‌గ‌లిగాం. నేప‌థ్య సంగీతంలో త‌న‌కు కావ‌ల్సినంత స్వేచ్ఛ తీసుకొని, న‌చ్చిన‌ట్టు బాదేశాడు త‌మ‌న్‌. సినిమా కోసం చాలా ఖ‌ర్చు పెట్టారు. కాస్ట్ తెర‌పై క‌నిపిస్తోంది. కానీ ద‌ర్శ‌కుడు ఓ మంచి క‌థ‌ను రాసుకోవ‌డంలో, సన్నివేశాల్ని ప్రేక్ష‌కులకు న‌చ్చేలా తీర్చిదిద్ద‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు.

* పంచ్ లైన్‌
తిక్క‌... త‌ల తిప్పేసింది బాబోయ్‌

* రేటింగ్: 1/5

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here