English | Telugu

పాతికేళ్ల అసెంబ్లీ రౌడీ..!

on Jun 4, 2016

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు..నటుడుగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నారు. నటుడు 560కు పైగా సినిమాలు, నిర్మాతగా 60 చిత్రాలను నిర్మించిన ఆయన కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో మైల్ స్టోన్ అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు  అంటే ఏంటో తెలియజెప్పిన చిత్రం. ఈ సినిమా 1991, జూన్ 4న విడుదలై నేటికి సరిగ్గా పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి విశేషాలను తెలియజేశారు.. "తమిళ చిత్రం ఎనకు వేలై కడిచాచ్చి చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అల్లుడుగారు సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి హక్కులను తీసుకున్నాం. బి.గోపాల్ అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్నాడు, తనకు ఫోన్ చేసి క్యాసెట్ పంపిస్తున్నాను. సినిమా చూడు, మనం సినిమా చేద్దాం అన్నాను. మా మధ్య ఉన్న స్నేహబంధంతో తను ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాను ఓ సారి పరుచూరి బ్రదర్స్ కు సినిమా చూపిద్దాం అన్నారు. పరుచూరి గోపాలకృష్ణగారు సినిమా చూసి సూపర్ హిట్ అవుతుంది. తప్పకుండా చేద్దామని అన్నారు. సినిమాను స్టార్ట్ చేశాం. హీరోయిన్ గా అప్పుడే బొబ్బిలిరాజా చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతిని తీసుకోవాలనుకున్నాం. అయితే ఇండస్ట్రీలో మనం బాగుంటే చూడలేని చాలా మంది ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఎందుకు తీసుకుంటారు. అని కూడా అన్నవారు ఉన్నారు. అలాగే నాకు, బి.గోపాల్ మధ్య అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వీటిని కాదని సినిమా చేశాం. స్వర్గం-నరకం చిత్రంలో నాతో హీరోయిన్ గా నటించిన అన్నపూర్ణను నా తల్లిపాత్ర కోసం అడిగాం. అలాగే నా తండ్రి పాత్ర కోసం ముందుగా రావుగోపాలరావుగారిని అనుకున్నాం కానీ ఆయన సెట్ కు నేను ఆలస్యంగా వస్తాను. నీకు ఇబ్బంది అవుతుంది. నీవు కోపడ్డతావు..అది మన మధ్య రిలేషన్ ను దెబ్బ తీసే ప్రమాదం ఉందని అన్నారు. సరేనని నేను జగ్గయ్యగారికి ఫోన్ చేసి ఆయన్ను కూడా సినిమా చూడమని క్యాసెట్ పంపాను. ఆయన కూడా నటించడానికి అంగీకరించారు.  ఇక బి.గోపాల్ గురించి చెప్పాలంటే తనతో నాలుగు సినిమాకు కలిసి పనిచేశాను. ఏనాడు నాకు ఇది కావాలి అంటూ నిర్మాతలను ఇబ్బంది పెట్టే దర్శకుడు కాదు. ఏదైనా వద్దని అనిపిస్తే సున్నితంగా చెప్పేవాడు. సినిమాను 41 రోజుల్లోనే చిత్రీకరించాం. టైటిల్ విషయానికి వచ్చేసరికి అసెంబ్లీ రౌడీ ఏంటని, సినిమాను బ్యాన్ చేయాలని అప్పుడు అసెంబ్లీలో పెద్ద దుమారమే చేలరేగింది. సినిమా పోస్టర్స్, కటౌట్స్ ను తగలబెట్టడం చేశారు. అయితే అన్నగారు నందమూరి తారక రామారావుగారు అండగా నిలబడ్డారు. అప్పటి స్పీకర్ ధర్మారావుగారు సినిమా చూసి సినిమా చాలా బావుందని అన్నారు. అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం 25 వారాల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇందులో హీరోగా విష్ణు నటిస్తారు’’ అన్నారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘’అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు గారు ఓ కొడుకుగా, ప్రేమికుడుగా, బాధ్యత గల యువకుడుగా, ఎమ్మెల్యేగా ఎన్ని వెర్షన్స్ లో డైలాగ్స్ చెప్పారో నాకు తెలుసు. షూటింగ్ టైంలో ఆయన నటనను అలా చూస్తూ ఉండిపోయాం. పరుచూరి బ్రదర్స్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కుదిరింది’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘’సినిమా డైలాగ్స్ ను ఒకటిన్నర రోజులోనే పూర్తి చేశాం. తమిళం కంటే తెలుగులో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఆ డైలాగ్స్ మోహన్ బాబు చెప్పిన తీరు ఇప్పటికీ హైలైట్ గా నిలిచిపోయింది. సినిమా విడుదలైన తర్వాత తన భార్యబిడ్డల సహా మా ఇంటికి వచ్చి ఇకపై నిన్ను అగ్రజ అని పిలుస్తానని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే పిలుస్తున్నారు. ఈ సినిమా మా అందరికీ మరచిపోలేని జర్నీ’’ అన్నారు.

మోహన్ బాబు కున్న కలెక్షన్ కింగ్ అన్న పేరును సార్థకం చేసిందీ సినిమా. జూన్ 4,1991 న రిలీజై, బాక్సాఫీస్ ను ఆటాడుకుంది. ముఖ్యంగా సరైన డైలాగ్స్ పడితే మోహన్ బాబు నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించింది. డైలాగ్స్ తో జనాల చేత విజిల్స్ కొట్టించిన సినిమా ఇది. సినిమాలో ఆయన డైలాగ్స్ కొన్ని.

1. అరిస్తే చరుస్తా..చరిస్తే కరుస్తా..కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా..ఖబడ్డార్..

2. అరవకు మాజీ. హాజీ అనటానికి, రాజీ పడటానికి, బేజారవటానికి నన్ను కన్న మాతాజీ నాకు మామూలు నెత్తురివ్వలేదు.
 
3. నిన్ను నిలబెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నిను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి నువ్వు కట్టిన బట్టలూడ్చి వెళ్లకపోతే నేను వీరశివాజీనే కాదురా బేవకూఫ్.

4. బోఫోర్స్ నుంచి ఏ ఫోర్స్ గురించైనా బయటపెట్టేది ఈ పత్రికల వాళ్లే. వ్యభిచారం చేసే వాడు నీతి, అపచారం చేసే వాడు జాతి తలవకూడదు మంత్రిగారూ..

5. ఒక పార్టీ పేరుతో, ఒక నాయకుడి అండతో గెలిచి, ఈ రోజు నుంచి ఈయన రామచంద్రుడు, నేను హనుమంతుణ్ని అని చెప్పి కుప్పిగంతులు వేస్తే, ఆ తంతుకు తంతారు జనం.

6. నేను పాత శివాజీగా ఉండుంటే, చెంపదెబ్బ, చేయిదెబ్బ, కాలు దెబ్బ, కర్ర దెబ్బ, దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి సత్రం చేసుండేవాడినిరా..


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here