బిచ్చగాడు టాప్ లో ఉన్నాడండోయ్..!
on May 31, 2016
ఒక్కోసారి టాలీవుడ్ లో అనుకోని హిట్స్ వస్తుంటాయి. ఇది ఎవరు చూస్తారులే అనుకున్నవి కాస్తా మంచి లాభాల్ని తీసుకొచ్చి హిట్స్ గా నిలుస్తుంటాయి. చాలా రేర్ గా, అన్నీ కలిసొస్తేనే జరిగే ఈ ఫీట్ ను బిచ్చగాడు చేసేశాడు. టైటిల్ చాలా విచిత్రంగా ఉండటంతో ఇదేం సినిమారా అనుకున్నవాళ్లే, ఇప్పుడు హాళ్లకు వెళ్లి ఈ సినిమాను చూస్తున్నారు. నిర్మాతలకు పెట్టిన రెండు మూడు రెట్లు ఎక్కువే లాభం వచ్చిందని సమాచారం. ఈ వారం ఆడుతున్న సినిమాల్లో, ప్రస్తుతం బిచ్చగాడే ఫుల్ జోష్ లో ఉన్నాడు.
రాయుడు: మరో డబ్బింగ్ సినిమా రాయుడుతో విశాల్ మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకోగలిగాడు. కాస్త మంచి సినిమాను తీసి ఉంటే, ఇలాంటి డ్రై వీక్ లో విశాల్ ఖాతాలో కంపల్సరీ హిట్ పడి ఉండేదే. కానీ, రొటీన్ ఫార్ములా ఊర నాటు సినిమా కావడంతో ఆడియన్స్ తగ్గుతూ వస్తున్నారు. పైపెచ్చు పూర్తి తమిళ నేటివిటీ కావడంతో సినిమాను తెలుగు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. తమిళంలో మరుదు గా రిలీజైన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్నే నమోదు చేసింది.
సుప్రీం: సుప్రీంను అఫీషియల్ గా హిట్ సినిమా అని డిక్లేర్ చేసేశారు ట్రేడ్ పండితులు. దాదాపు సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాల్లోనే ఉన్నారు. బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది.
బ్రహ్మోత్సవం: ఒక భారీ హిట్ ను, రికార్డ్ కలెక్షన్లను కుమ్మేసుకునే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు బ్రహ్మోత్సవం టీం. సినిమా పేలవంగా ఉండటంతో ఆడలేదు సరికదా..మిగిలిన సినిమాలకు రెవెన్యూ జనరేట్ చేసింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, సినిమా ఎందుకు పోయిందో చూద్దామని వెళ్లేవాళ్ల కారణంగా, ఈ సినిమా థియేటర్ లైఫ్ స్పాన్ మరో వారం మాత్రమే కనిపిస్తోంది. చాలా చోట్ల బ్రహ్మోత్సవం తీసేసి బిచ్చగాడు సినిమాను వేస్తున్నారంటే సిట్యువేషన్ అర్ధం చేసుకోవచ్చు.
సరైనోడు: కేరళలో యోధావుగా రిలీజై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సరైనోడి ప్రభంజనం తెలుగులో ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇదే భారీ హిట్ అంటే ఆశ్చర్యం లేదు. చూడటానికి వేరే సినిమాలేవీ ఆశాజనకంగా లేకపోవడంతో జనాలు సరైనోడికే క్యూ కడుతున్నారు.