సిల్క్ స్మిత రీళ్లకు దుమ్ము దులుపుతున్న స్టార్ దర్శకుడు...!
on Sep 18, 2018
"చూడండి బాబూ చూడండి... సిల్క్ స్మిత నటించిన 'రాగ తాళంగల్'. త్వరలో విడుదల చేస్తాం" అంటూ తమిళనాడులో ఓ దర్శకుడు టముకు వేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకున్న సిల్క్ స్మిత అర్ధాంతరంగా తనువు చాలించి రెండు దశాబ్దాలు దాటుతోంది. అయినా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ తగ్గలేదు. సిల్క్ స్మిత జీవితకథతో హిందీలో 'డర్టీ పిక్చర్' సినిమా తీశారు. మరికొన్ని సినిమాలు వచ్చాయి. 'కబాలి', 'కాలా' సినిమాల దర్శకుడు పా రంజిత్... దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి... ఆయన పర్యవేక్షణలో సిల్క్ స్మిత వెబ్ సిరీస్ తీయనున్నట్టు ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఒరిజినల్ సిల్క్ స్మిత నటించిన సినిమా అనగానే అందరిలో ఆసక్తి మొదలైంది.
అసలు వివరాల్లోకి వెళితే... సిల్క్ స్మిత జీవించిన రోజుల్లో తిరుపతి రాజన్ అనే దర్శకుడు ఆమెతో ఓ సినిమా తీశారు. ఆర్థిక సమయాలు కావొచ్చు... మరొకటి కావొచ్చు... కారణాలు ఏవైనా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అప్పటి నుంచి నాలుగు గోడల మధ్య ల్యాబుల్లో మగ్గిన ఆ సినిమా రీళ్లకు పట్టిన దుమ్ము దులిపి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట! అంటే... సిల్క్ స్మిత నటించిన సన్నివేశాలు యథాతథంగా ఉంచి, ఇప్పటి నటీనటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి ఓ సినిమా బయటకు తెస్తారన్నమాట. రెండున్నర దశాబ్దాల క్రితం తిరుపతి రాజన్ తీసిన 'తంగ తమరై' అనే సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఆ సినిమాను 'రాగ తాళంగల్' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్.