English | Telugu

సప్తగిరి LLB మూవీ రివ్యూ

on Dec 7, 2017


తారాగణం: సప్తగిరి, సాయికుమార్, శివప్రసాద్, షకలకశంకర్...
దర్శకత్వం:  చరణ్ లక్కాకకుల
నిర్మాత:  k.రవికిరణ్

ఎంటర్ టైన్మెంట్ అంటే ఏంటి?.. ప్రేక్షకుడ్ని కథతో కట్టిపడేయడం.. కథలోని పరిస్థితుల మధ్యకు ప్రేక్షకుడ్ని తీసుకెళ్లడం. భవోద్వేగానికి లోను చేయడం. ఆ మాయలో పడిపోయి... ‘అర్రెర్రె... సినిమా అప్పుడే అయిపోయిందా?’ అనేలా చేయడం. అది సిసలైన ఎంటర్ టైన్మెంట్. కానీ మన టాలీవుడ్ దర్శకులు కొందరు...ఫైట్లు, పాటలు, డాన్సులు, కక్కుర్తి కామెడీ సీన్లు... ఇవి ఉంటేనే ఎంటర్ టైన్మెంట్ అని ఫిక్సయిపోయారు  ఇలాంటి తప్పుడు అభిప్రాయం వల్ల మంచి కథలు హత్యకు గురవుతున్నాయ్. కథ, కథనాలపై పెట్టాల్సిన కాన్సన్ ట్రేషన్.. కథానాయకునిపై పెట్టడమే ఈ విపత్కర పరిస్థితులకు కారణం.
సరే... ఇక విషయానికొద్దాం. ఈ గురువారం ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’  అనే సినిమా విడుదలైంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘జాలీ ఎల్ఎల్ బి‘ కి ఇది రీమేక్. మాతృకలో హర్షద్ వర్సీ చేసిన పాత్రను ఇందులో సప్తగిరి చేశాడు. చరణ్ లక్కాకుల దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? మాతృక స్థాయిలో ఉందా? లేక సొంత పైత్యాలు రంగరించి పాడుచేశారా? ఈ విషయాలు తెలుసుకునే ముందు కథలొకెళ్దాం.  ‘జాలీ ఎల్ ఎల్ బి’ చూసిన వారికోసం కాదు. చూడని వారి కోసం.

కథ:-

సప్తగిరి యువ న్యాయవాది. మంచి లాయర్ గా పేరు సంపాదిస్తే తప్ప కూతుర్నిచ్చి పెళ్లి చేయనంటాడు మామ. దాంతో సొంతూరు వదిలి లక్ష్య సాథనకై హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ అతనికి ఓ కేస్ ఎదురవుతుంది. బిక్షగాళ్లపై కారు నడిపి... వాళ్ల చావుకు కారణమైన ఓ బిగ్ షాట్ కొడుకు కేస్ అది. దేశంలోొనే పేరుగాంచిన లాయర్ ‘రాజ్ పాల్’(సాయికుమార్)  చతురతతో ఆ కేస్ వాదించి అన్యాయాన్ని గెలిపిస్తాడు. కేసు కొట్టేస్తారు కూడా. అయితే... సప్తగిరి దృష్టి కొట్టేసిన ఆ కేసు మీదకెళ్తుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే ఉద్దేశంతో ఆ కేసుపై పిల్ దాఖలు చేస్తాడు. మళ్లీ తిరగతోడతాడు. రాజ్ పాల్ లాంటి తలపండిన న్యాయవాదిని సప్తగిరి ఎలా గెలిచాడు? న్యాయాన్ని ఎలా గెలిపించాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:-

కథ బలమైందయితే... కథనం ఎలా ఉన్నా.. ప్రేక్షకుడు ప్రయాణం చేసేస్తాడు. కథతో పాటు కథనం కూడా బావుంటే... ఆ సినిమాను నెత్తిన పెట్టేసుకుంటాడు. ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’  విషయానికొస్తే... అద్భుతమైన కథ. దానికి తగ్గ కథనం కూడా ‘జాలీ ఎల్ ఎల్ బి’ పుణ్యమా అని అప్పనంగా వచ్చేసింది. సో... కథ, కథనం రెండూ అదుర్సే. కానీ.. ఇలా అంతా బావుంటే ఎలా? మన టాలీవుడ్ మార్క్ పైత్యం కూడా కనిపించాలి కదా! మంచి కథను కాస్తో కూస్తో చెడగొట్టకపోతే అది తెలుగు సినిమా ఎలా అవుతుంది? . అందుకే... పాలంత స్వచ్ఛమైన కథలో కాస్తంత ఉప్పుని తీసుకొచ్చి కలిపారు. అదే.. అక్కర్లేని యాక్షన్ సీన్లు, అనవసరపు కామెడీ సీన్లు. అసలు సప్తగిరి అనే నటుడు... స్టార్ హీరో కాదు. అతనికి మాస్ ఇమేజ్ కూడా లేదు. అతన్నుంచి అన్నం తినే వాడు ఎవడూ... ఫైట్లను.. యాక్షన్ ఎపిసోడ్లను ఆశించడు. మరి అనవసరంగా అవన్నీ ఎందుకు పెట్టినట్టూ? సినిమాను ఎందుకు చెడగొట్టినట్టు? ఈ ప్రశ్నలకు సమాధానం దర్శకులవారికే తెలియాలి. ‘జాలీ ఎల్ ఎల్ బి’ సీక్వెల్ అక్షయ్ కుమార్ చేశాడు. ఆయన ఇండియాకే సూపర్ స్టార్. ఊర మాస్ హీరో. ఆయన కూడా ఇదే ఈ పాత్ర చేశాడు. కనీసం ఆయన కోసమైనా ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా పెట్టుకోలేదు. మన సప్తగిరి... అక్షయ్ కుమార్ కంటే యాక్షన్ హీరోనా? కనీసం ఆ మాత్రం ఇంగితం ఉండక పోతే ఎలా? నిజానికి కథను కథగా తీస్తే... ఈ సినిమా పెద్ద హిట్. నటన పరంగా సప్తగిరి కూడా బాగా చేశాడు. సాయికుమార్ ఓ వైపు విశ్వరూపం చూపిస్తుంటే... అతని ఢీ కొట్టేంత అద్భుతంగా నటించాడు. ఈ ఉత్కంఠ చాలదా ప్రేక్షకులకు? ఎందుకు ఫైటింగులు? ఎందుకు కామెడీ సీన్లు? కోర్టు సీన్లు ఈ సినిమాకు ప్రాణం. సప్తగిరి, సాయికుమార్, శివప్రసాద్ ముగ్గురూ చెడుగుడు ఆడేశారు. అనవసపు హడావిడీని పక్కనపెట్టి చూస్తే సినిమా బావుంది. సామాజిక అంశాల మేళవింపుతో తయారైన కథ, కథనాలు ఎప్పుడూ బావుంటాయని మరో మారు రుజువు చేసిందీ సినిమా. సంగీతం కూడా బావుంది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం. ఎడిటింగ్ లో మాత్రం తడబాటు కనిపించింది. నిర్మాత వృధా ఖర్చు కూడా కనిపించింది.

మొత్తంగా ‘జాలి ఎల్ ఎల్ బి’ చూడని వారికి ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ నచ్చుతాడు.

రేటింగ్:- 2.75


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here