English | Telugu

శైలజారెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

on Sep 13, 2018

 

తారాగ‌ణం : నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, మురళీశర్మ, 'వెన్నెల' కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నరేశ్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: మారుతి
నిర్మాణ సంస్థ బ్యానర్ : సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌లు:  సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్  
కెమెరా: నిజార్ షఫీ
సంగీతం: గోపిసుందర్
నిర్మాణ సంస్థ‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుదలైన తేది : 13/09/2018

గడసరి అత్త - అత్తను ఓ ఆట ఆడుకునే అల్లుడు... తెలుగులో సూప‌ర్‌హిట్‌ ఫార్ములా! అత్త-అల్లుడు మధ్య సవాల్, ప్రతి సవాల్ నేపథ్యంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. అత్త పొగరుకు అల్లుడు కళ్లెం వేయడం అనేది ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టని ఎవ‌ర్‌గ్రీన్‌ ఫార్ములా. ఈ నేపథ్యంలో వచ్చిన మెజారిటీ తెలుగు సినిమాలు విజయాలు సాధించాయి. ఇదే ఫార్ములాకు మార్పులు చేర్పులు చేసి కొత్తగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మారుతి. సరికొత్త అత్త అల్లుడు కథతో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణ నటించారు. నాగార్జున-రమ్యకృష్ణది సూప‌ర్‌హిట్‌ కాంబినేషన్‌. మన్మథుడికి మంచి జోడీ అనిపించుకున్న రమ్యకృష్ణ.. చైతూకి అత్త అనడంతో ఆటోమేటిక్‌గా ఆడియ‌న్స్‌లో ఆసక్తి కలిగింది. అంచనాలు కలిగించింది. ఆ ఆసక్తికి తగ్గట్టు 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా?  

క‌థ‌:

అహంకారానికి (ఈగోకి) ఆధార్ కార్డు లాంటి అమ్మాయి అను (అనూ ఇమ్మాన్యుయేల్). ఆమెను చూసి తొలిచూపులో ప్రేమించేస్తాడు చైతూ (అక్కినేని నాగచైతన్య). ఇంట్లో తండ్రిది కూడా ఈగోయిస్ట్ క్యారెక్టర్ కావడంతో అను ఈగో అతడికి సులభంగా అర్థం అవుతుంది. దాంతో ప్రేయసి ఈగోకి తగ్గట్టు.. ఆమె దగ్గర ఎలా నడుచుకుంటే ప్రేమలో పడుతుందో? అలా నడుచుకుంటాడు. అను కూడా చైతూని ప్రేమిస్తుంది. కానీ, చెప్పడానికి ఆమెకు అహం అడ్డొస్తుంది. మొదట్లో పొగరుగా నడుచుకున్నా... తరవాత చైతూని చూసి తొలిచూపులో ప్రేమలో పడిన విషయం చెబుతుంది. వీళ్ల ప్రేమకు చైతూ తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఎవరో ఏదో అన్నారని ఈగోకి పోయి ఇద్దరికీ నిశ్చితార్థం జరిపించేస్తాడు. తరవాత వ‌రంగ‌ల్‌లో లీడ‌ర్‌, ఫైర్ బ్రాండ్‌ శైలాజారెడ్డి (రమ్యకృష్ణ) కూతురు అను అనే సంగతి తెలుస్తుంది. ఓ విషయంలో పంతానికి పోయి ఐదేళ్లుగా తల్లీకూతుళ్లు శైలజారెడ్డి, అను మాట్లాడుకోవడం లేదనే సంగతి చైతూకి తెలుస్తుంది. అసలు, తనకు తెలియకుండా జరిగిన నిశ్చితార్థం పట్ల శైలజారెడ్డి ఎలా స్పందించింది?  ఈగోలకు పోయి ఒకరితో మరొకరు మాట్లాడుకొని తల్లీకూతుళ్లను చైతూ ఎలా కలిపాడు? మనసుల్లో ప్రేమను బయటకు ఎలా తీశాడు? 'వాడు శైలాజారెడ్డి అల్లుడు' అని అత్త చేత అనిపించుకునేంతలా ఏం చేశాడు? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధాన‌మే సినిమా.

ఎనాలసిస్:

'నా పొగరును అమాయకత్వం అనుకుని ప్రేమించు. ఇది ఇంతే అనుకుని భరించు' - హీరోకి తన ప్రేమను  వ్యక్తం చేసే సన్నివేశంలో హీరోయిన్ చెప్పే ఓ డైలాగ్. ఈ ఒక్క మాటలో కథంతా దాగుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌కి జ‌స్టిఫికేష‌న్ కూడా వుంది. ఎదుటి వ్యక్తిలో ఈగోని హీరో ప్రేమిస్తాడు. వాళ్లంతే అనుకుని ప్రేమిస్తాడు. కథలోని ఈ అంశమే ఇప్పటివరకూ అత్త-అల్లుడు ఫార్ములాతో వచ్చిన సినిమాల మధ్య 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాను కొత్తగా చూపించింది. సగటు ప్రేక్షకులు ఆశించే హీరోయిజంను సినిమాలో లేకుండా చేసింది. అందువల్ల, కొంతమంది మాస్ మసాలా ప్రేక్షకులు నిరుత్సాహపడే అవకాశం వుంది. అత్త ఫైర్ బ్రాండ్ అయితే... అల్లుడు సైలెంట్. టిట్ ఫర్ టాట్ అన్నట్టు అత్తకు బుద్ధి చెప్పాలనుకోడు. ఆమెలో ప్రేమను బయటకు తీసుకురావడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తాడు. నచ్చిన అమ్మాయిని ప్రేమలో పడేసే సమయంలోనూ అంతే. ఈ క్రమంలో హీరో చేసే కొన్ని పనులు నవ్విస్తాయి. హీరోయిజం లేకపోవడం విసుగు తెప్పిస్తుంది. 'తొలిప్రేమ'లో కీర్తీ సురేశ్‌ని చూసి పవన్ కల్యాణ్ ప్రేమలో పడినట్టు... ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ని చూసిన వెంటనే నాగచైతన్య ప్రేమలో పడటానికి బలమైన కారణం ఏం లేదు. అందువల్ల, ప్రేమ కోసం చైతూ  వేసే ఎత్తులు అంతగా ఆకట్టుకోలేదు. కానీ, అతడి పక్కన అసిస్టెంట్ క్యారెక్టర్ (చారి)లో నటించిన 'వెన్నెల' కిశోర్ నటన నవ్విస్తుంది. సరదా సరదాగా ప్రథమార్థం ముగుస్తుంది. విశ్రాంతి తరవాత శైలాజారెడ్డి కథలో ప్రవేశిస్తుంది.

మొదట్లో ఆమెకు ఇచ్చినంత బిల్డప్ తరవాత తరవాత సన్నివేశాల్లో కొరవడుతోంది. శైలజారెడ్డి కూతురు తను ప్రేమించేనవాణ్ణి ఇంట్లో అమ్మకు డాక్టర్ అని పరిచయం చేస్తుంది. ఆమెకు తప్ప మిగతా అందరికీ విషయం తెలుస్తుంది. ద్వితీయార్థంలో ఈ సన్నివేశాలన్నీ శ్రీనువైట్ల మార్క్ సినిమాలైన 'ఢీ', 'రెడీ' ఫార్ములాను గుర్తు చేస్తాయి. ఇక్కడ 'వెన్నెల' కిశోర్‌కి పృథ్వీ జత కలవడంతో నవ్వులు లోటు లేకుండా కొన్ని సన్నివేశాలు సాగాయి. అయితే... ప్రేక్షకుడు కథను సులభంగా ఊహించగలడు. దీనికి తోడు నవ్వులకు ఫుల్ స్టాప్ పెట్టి అసలు కథలోకి, క్లైమాక్స్‌లోకి వెళ్లిన తరవాత బండి నెమ్మదించింది. క్లైమాక్స్ అంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీలయ్యేలా  'జీవితంలో మనం ప్రేమించే ప్రతిదాని వెనుక ఒక కష్టం దాగుంటుంది. దాన్ని తట్టుకోగలిగితే హ్యాపీగా వుంటాం' అని సినిమా స్టార్టింగులో హీరో ఒక డైలాగ్ చెబుతాడు. ప్రేక్షకులు తమకు దాన్ని అన్వయించుకోవచ్చు. కాసేపు కాలక్షేపం చేయడానికి, హాయిగా నవ్వుకోవడానికి థియేటర్లకు వెళ్లాలని అనుకుంటే... కష్టమైనప్పటికీ రొటీన్ కథ, కథనాల్ని భరించక తప్పదు. వాటిని తట్టుకుంటే నవ్వుకోవచ్చు.  


న‌టీన‌టుల ప‌నితీరు..

అక్కినేని నాగచైతన్య నటనలో పరిణితి కనిపించింది. పాత్రలో చక్కగా ఒదిగి నటించాడు. కామెడీ టైమింగ్ బావుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్, అందులో అతడి ఆటిట్యూడ్, బ్యాగ్రౌండులో 'హలో బ్రదర్' సినిమాలోని పాట 'ప్రియ రాగానే గుండెలోన' మ్యూజిక్ అభిమానులకు కిక్ ఇస్తాయి. చైతూ స్టయిల్, యాక్టింగ్ సినిమాకి ప్లస్. శైలజారెడ్డిగా రమ్యకృష్ణ సినిమాకు భారీతనం తీసుకొచ్చారు. అయితే... కొన్నిసార్లు శివగామి ఎక్స్‌ప్రెష‌న్లు ఇవ్వడంతో సన్నివేశంలో అవసరమైన దానికంటే ఎక్కువ నటిస్తుందా? అనే అనుమానం కలుగుతుంది. మాణిక్యంగా పృథ్వీ, చారిగా 'వెన్నెల' కిశోర్ వందశాతం నవ్వించారు. సినిమాకు వాళ్ల వినోదమే బలం. నటిగా అనూ ఇమ్మాన్యుయేల్ గత సినిమాల కంటే పర్వాలేదని అనిపించింది. అయితే... ఆమె ఫిజిక్ హీరోయిన్‌కి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ అన్నట్టు వుంది. అనూ ఇమ్మాన్యుయేల్ కంటే హీరో సిస్టర్ పాత్రలో నటించిన అమ్మాయి, రమ్యకృష్ణ నాజూకుగా కనిపించరు. రామకృష్ణ అయితే హీరోయిన్‌కి అమ్మలా కాకుండా, అక్కలా కనిపించింది. సీనియర్ నరేశ్, దాసరి కుమారుడు అరుణ్ పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. మురళీశర్మ గెటప్ కొత్తగా వుంది. యాక్టింగ్ కూడా కొత్తగా ట్రై చేశాడు. కానీ, కుదరలేదు. మంగ్లీ, సిద్ శ్రీరామ్ పాడిన పాటలు తప్పిస్తే.. మిగతావాటిలో గుర్తుపెట్టుకునేవి ఏవీ లేదు. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువల్లో భారీతనం కనిపించింది.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కథ గురించి, లాజిక్కులు గురించి, రొటీన్ కథనం గురించి ఆలోచించకుండా వెళితే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. నాగచైతన్య నటన, మారుతి రాసిన వినోదాత్మక సన్నివేశాలు అలరిస్తాయి. కొసరు వినోదం మీద కాకుండా అసలు కథ మీద కొంచెం శ్రద్ధ వహించి, ఫాదర్ & సన్, మదర్ & డాటర్ సెంటిమెంట్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా తీస్తే ఇటు నాగచైతన్యకు, అటు మారుతికి గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయేది.

Rating : 2.25


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here