అరవిందలో పాట... ఎవ్వరికీ ఇవ్వడట!
on Oct 1, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ హీరోగా తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ‘మాటల మాంత్రికుడు.. గురూజీ’ అని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్టీఆర్ హీరోగా నటించిన చాలా సినిమాలకు తమన్ సంగీతం ఇచ్చాడు. కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి. త్రివిక్రమ్ ఏ సంగీత దర్శకుడితో పని చేసినా చాలా మంచి అవుట్పుట్ రాబట్టుకుంటాడు. కాని తమన్ విషమంలో అతడి లెక్క తప్పినట్టుంది. ‘అరవింద సమేత..’ పాటల్లో సాహిత్యానికి మంచి పేరొచ్చింది కానీ... సంగీత పరంగా పాటలు అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ కబుర్లు పక్కన పెడితే... తమన్ స్వరపరిచిన పాటలన్నిటినీ త్రివిక్రమ్ ఉపయోగించుకోలేదు.
‘అరవింద సమేత వీరరాఘవ’లో మొత్తం నాలుగు పాటలున్నాయి. అయితే... తమన్ ఐదు పాటలు ఇచ్చాడు. ముందుగా ఐదు పాటలను సినిమాలో పెట్టాలనుకున్నారు. కాని కథకు అడ్డు వస్తుందని ఒక పాటను పక్కన పెట్టేశారు. తమన్ మొదట ఆ పాటనే చేసి ఇచ్చాడట! అందువల్ల, ఆ పాట అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు. సాధారణంగా ఒక సినిమా కోసం చేసిన పాటను వివిధ కారణాల వల్ల ఉపయోగించకపోతే.. వేరే సినిమాకు సంగీత దర్శకులు ఉపయోగిస్తారు. కాని తమన్ మాత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ కోసం చేసిన తొలి పాటను ఎవ్వరికీ ఇవ్వనని అంటున్నాడు. హీరో, దర్శకుడు, నిర్మాత అనుమతి తీసుకొని ఇతర సినిమాలకు ఆ ట్యూన్ ఇవ్వవచ్చు కాని తాను ఆ పని ఎప్పటికీ చేయనని తెలిపాడు. బహుశా... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా వస్తే అప్పుడు ఉపయోగిస్తారేమో చూడాలి!!