బాహుబలి పై కన్నేసిన సూపర్ స్టార్
on Apr 21, 2014
ప్రభాస్, రానా, అనుష్క జంటగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో "బాహుబలి" అనే బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ను ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు చూస్తూ వస్తున్నారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా "బాహుబలి" షూటింగ్ చూడాలని ఉందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళినే అడిగారట.
"బాహుబలి సెట్ కు రావాలనుకుంటున్నాను. నీ షూటింగ్ చూడాలనుకుంటున్నాను.... అని రజిని సార్ అన్నారు. ఇది నా జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనల్లో ఒకటి. థ్యాంక్యూ సార్" అని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కానీ రాజమౌళి ఎలా స్పందించాడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయనున్నారు.