అసహ్యం వేస్తోంది... ‘ఛీ ’అనాలనిపిస్తోంది
on Oct 4, 2017
‘మగాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చా? ఆడది మాత్రం భర్తతో విడిపోయిన తర్వాత కూడా... జీవితంలో చెరపరాని తప్పు చేశాననే అపరాధభావంతో జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలా? ఆడది మరో పెళ్లి చేసుకోవడం తప్పా? ఇదెక్కడి న్యాయం? ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నానన్న భావనే చిరాకు పుట్టిస్తోంది’... అంటూ ట్విట్టర్ లో చాలామందికి ట్యూషన్ చెప్పేసింది రేణూదేశాయ్. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో... తనకు ఓ జీవిత భాగస్వామి ఉంటే బావుండనినిపిస్తోందని మనసులో మాట బయటపెట్టిందామె. అంతే... ఇక అక్కడ్నుంచి ఆమెపై కామెంట్లతో యుద్ధానికి దిగారు పవన్ ఫ్యాన్స్. కొంతమందైతే.. చాలా ఘాటుగానే స్పందించారట. ఈ పరిణామంపై రేణూ మనసు నొచ్చుకుంది.
దాంతో ఓ అభిమాని హేట్ కామెంట్ ని తన ట్విటర్ లో పోస్ట్ చేసి.. తను కూడా అందరికీ ఘాటుగా బదులిచ్చేసింది. ఆడదాని స్వేచ్ఛా, స్వాతంత్రం, సమన హక్కు.. ఇవన్నీ ఇక్కడ మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించవు. ఇది నేటికీ పురుషస్వామ్య వ్యవస్తే. దానికి నాపై వచ్చిన నెగిటీవ్ కామెంట్లే నిదర్శనం. మగాళ్లయితే.. ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు. ఆడదాన్ని నేను రెండో పెళ్లి చేసుకోకూడదా? నాకు ఓ తోడు చూసుకుంటే తప్పా? ఒంటరిగానే బతకాలా? ఇదెక్కడి న్యాయం. జస్ట్ నాకూ ఓ లైఫ్ పార్టనర్ ఉంటే బావుండనిపిస్తోంది అని అన్నందుకు నాపై ఇలాంటి హేట్ మెసేజస్ పంపుతారా? ఇలాంటి మగాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ‘ఛీ’ అనాలనిపిస్తోంది.
సాటి స్త్రీలందరికీ నేను చెప్పేదొక్కటే. ముందు మార్పు మనలో రావాలి. మన మగబిడ్డలందరినీ స్త్రీలపై గౌరవభావం పెరిగే విధంగా పెంచి పెద్ద చేయండి. అప్పుడు కానీ... ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రాదు. అని ట్వీట్ చేసింది రేణు. పాపం..రేణు.. ఏడేళ్లుగా భర్తకు దూరమై... ఇద్దరి పిల్లలతో ఒంటరి జీవితాన్నే గడిపింది. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే... సమాజమే ఆమెకు సహకరించడంలేదు. ఇది నిజంగా చిత్రమైన పరిస్థితి. అంతటి అభిమానగణం ఉన్న భర్తకు భార్య అవ్వడం... ఆమె పరిస్థితికి ఓ కారణం. రేపు నిజంగా రేణూ వివాహం చేసుకుంటే... పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారు? తమ అభిమాన హీరో స్థానంలో మరొకర్ని చూస్తే.. వారు తట్టుకోగలరా? అలాగని... ఎవరి ఆనందం కోసమో.. రేణూ తన జీవితాన్ని మోడు చేసుకోవాలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.