విడాకుల రహస్యం బయటపెడతా - రేణుదేశాయ్
on Jun 29, 2018
మన దేశం చాలా చిత్రమైంది. ఇందులో ‘కొందరు’ అభిమానులు ఇంకా చిత్రమైనవాళ్లు. తమ అభిమాన నటుడు ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నా వాళ్లకి అభ్యంతరం ఉండదు. కానీ అతను విడాకులు ఇచ్చిన వ్యక్తి మాత్రం జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాల్సిందే! ఇదే సమస్య ఇప్పుడు రేణు దేశాయ్ ఎదుర్కొంటోంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ చాలాకాలం ఒంటరిగానే ఉంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలం గడిపేసింది. కానీ ఎప్పుడైతే తనకి మరో తోడు కావాలని కోరుకుందో అప్పటినుంచి పవన్ అభిమానులు కొందరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొందరు ఏకంగా బెదిరింపులకే దిగారు.
ఇవన్నీ భరించిన రేణు చివరికి ధైర్యం చేసి ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయినా పవన్ వీరాభిమానులకు భయపడి... తనకు కాబోయే భర్త మొహాన్ని కూడా చూపించలేకపోయింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా పవన్ కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడంతో, అభిమానుల ఆగడాలు తగ్గుతాయని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. దాంతో రేణు ఏకంగా తన ట్విట్టర్ ఎకౌంట్నే మూసేసింది. ‘ట్విట్టర్లో ఉన్న నెగెటివిటీ కారణంగా’ తన అకౌంట్ క్లోజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కానీ పాపం ఇన్స్టాగ్రాం అకౌంటుని మాత్రం అలాగే కొనసాగించింది. అదే రేణు చేసిన పాపం. ఇప్పుడ ఇన్స్టాగ్రాంలోనూ ఆమెను వేధించేవాళ్లు మొదలయ్యారు.
ఆకతాయి అభిమానుల పట్ల భూదేవి అంత ఓర్పు పట్టిన రేణు దేశాయ్లో సహనం చచ్చిపోయింది. దాంతో తనని ట్రోల్ చేస్తున్నవాళ్లకి ఓ ఘాటైన సమాధానం పెట్టింది- ‘విడాకుల గురించి ఇన్నాళ్లూ తాను మౌనంగా ఉన్నందుకు పవన్ అభిమానులు తనకి రుణపడి ఉండాలనీ... ఒకవేళ తాను కనుక నోరు తెరిచి విడాకులకి దారితీసిన కారణాలు చెబితే వాళ్ల పొగరంతా దిగిపోతుందనీ’ హెచ్చరించింది. మరి ఈ సమాధానంతో ఆకతాయిలు ఊరుకుంటారా లేకపోతే ఇంకా చెలరేగిపోతారా. ఇంతకీ రేణుదేశాయ్ ఇన్నాళ్లూ మౌనంగా ఉంచిన విషయాలు ఏంటి? చూస్తుంటే ఆ రహస్యం ఏమిటో త్వరలోనే బయటపడేట్లు ఉంది!