గందరగోళంలో ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల!?
on Feb 7, 2019
ఫిబ్రవరి 7... ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు చిత్రాన్ని ముందుగా విడుదల చేయాలనుకున్న తేదీ. అయితే... మొదటి భాగానికి వచ్చిన స్పందన చూసి రెండో భాగంలో రిపేర్లు చేయాలనుకోవడంతో ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయాలి అనుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తరువాత ఫిబ్రవరి 14 లేదా 22 తేదీల్లో సినిమా విడుదల కావచ్చని వార్తలు వినిపించాయి. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా సరైన సమాచారం లేకపోవడంతో విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ఏమిటంటే... ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో వచ్చే అవకాశమే లేదు. మహాశివరాత్రి కానుకగా మార్చి 1వ తేదీన మహానాయకుడిని విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటంటే... ముందు సినిమా చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు విడుదలకు కనీసం పది రోజులు ముందు పూర్తి కావాలి. ఫస్ట్ కాపీ రెడీ కావాలి. సెన్సార్ పూర్తయి... ఒక్కసారి విడుదల తేదీ ప్రకటిస్తే... ఎన్నికలను మహానాయకుడు ప్రభావితం చేస్తుందని కచ్చితంగా ఎవరో ఒకరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
పది రోజుల ముందు ఫస్ట్ కాపీ రెడీ అయితే... ఫిర్యాదుదారులకు సినిమా చూపించి ఎలాంటి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసుకోవచ్చు. అయితే... పది రోజుల ముందు సినిమా రెడీ అవుతుందా? లేదా? అనేది డౌట్. ఎందుకంటే... ఇంకా సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. రామోజీ ఫిలిం సిటీ లో బాలకృష్ణ, ఇతర తారాగణంపై క్రిష్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ షూటింగ్ పూర్తయి... మరో పది రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయితే... శివరాత్రికి సినిమా థియేటర్లలోకి వస్తుంది. మొదటి భాగాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు రెండో భాగాన్ని ఇస్తున్నారు. మొదటి భాగం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చడంతో బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారట.