ఎన్టీఆర్... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు!?
on Sep 13, 2018
నందమూరి తారకరామారావు రూపురేఖలు ఎలా వుంటాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాగని, పోస్టర్లో ఆయన ఫొటో పెట్టేస్తే ఎలా? బాలకృష్ణ ఫొటో పెట్టాలి కదా! మరి, దర్శకుడు క్రిష్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో??
అసలు వివరాల్లోకి వెళితే... నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘యన్.టి.ఆర్’. ఇందులో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు బాలకృష్ణ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ లుక్‌ని ఆల్రెడీ విడుదల చేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలో దగ్గుబాటి రానా లుక్‌ని విడుదల చేశారు. సినిమాలో నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లుక్ రావడానికి ముందే లోకేషన్లో రానా ఫొటోలు లీకయ్యాయి. అందరూ రానా గెటప్ బావుందన్నారు. ఈ రోజు క్లారిటీగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ పోస్టర్ లీలగా కనబడుతోంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా చంద్రబాబు జీవితంలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో వుంది. పైగా, పిల్లను ఇచ్చిన మావ. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు స్మరిస్తున్నారు. అటువంటి చంద్రబాబు వెనుక ఎన్టీఆర్ ఫొటో ఉండటంలో తప్పేముంది? అనుకుంటున్నారా!! ముమ్మాటికీ తప్పే!
చంద్రబాబుగా రానా లుక్ ఏ సినిమాలోనిది? ‘యన్.టి.ఆర్’లోనిది! ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నది ఎవరు? బాలకృష్ణ! అప్పుడు సినిమాలో చంద్రబాబుగా నటిస్తున్న రానా వెనుక ఎవరి ఫొటో వుండాలి? ఎన్టీఆర్‌గా నటిస్తున్న బాలకృష్ణది కదా! మరి, ఎన్టీఆర్ ఫొటో పెట్టేస్తే ఎలా? తప్పే కదా! ఈ చిన్న లాజిక్‌ని క్రిష్ అండ్ కో ఎలా మిస్ అయ్యారో?? సినిమా విడుదల సమయానికి ఈ తప్పుని సరి చేసుకుంటే సరి! లేదంటే నవ్వులపాలు కావలసి వస్తుంది!!