కోబ్రా... వర్మ టార్గెట్ ఎవరు?
on Apr 8, 2019
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటుడిగా పరిచయం అవుతున్న సినిమా 'కోబ్రా'. ఇందులో ఆయన ఓ ఇంటిలిజెంట్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, కథకుడిగా, గాయకుడిగా... ఇలా ఇన్నాళ్లు తెరవెనుక ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ లో పలు పాత్రలు పోషించిన వర్మ, తొలిసారి తెర ముందుకు వస్తున్న సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కన్నడ నటుడు సుదీప్ కూడా. సినిమా వర్గాల్లో నటుడిగా వర్మ ఎంట్రీ గురించి డిస్కషన్ జరుగుతుంటే... రాజకీయ వర్గాల్లో ఈసారి వర్మ ఎవరిని టార్గెట్ చేశారోనని డిస్కషన్ జరుగుతోంది. దీనికి కారణం 'కోబ్రా' ఫస్ట్ లుక్.
'మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్ ఇది'
'శత్రువుని చంపడానికి త్రాచుపాముని చేరదీస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది'
'వాడిని కాని అరెస్ట్ చేస్తే, సగం పోలీస్ డిపార్ట్మెంట్ జైల్లోకి వెళుతుంది'
- ఇవి 'కోబ్రా' ఫస్ట్ లుక్ మీద కనిపించే స్టేట్మెంట్స్. వీటికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో రంగారావు నటిస్తున్నారని ఫస్ట్ లుక్ లో స్పష్టం చేశారు. దాంతో రాజకీయ వర్గాల్లో సినిమాపై ఆసక్తి మొదలైంది. ఎన్కౌంటర్ లో మరణించిన హైదరాబాద్ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. అప్పట్లో నయీమ్ కు పలువురు పోలీసు అధికారులు సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. అసలు, నయీమ్ ని పెంచి పోషించినది రాజకీయ నాయకులే అనే గుసగుసలు వినిపించాయి. 'కోబ్రా' ఫస్ట్ లుక్ విడుదల తర్వాత వ్యక్తమవుతున్న సందేహాలకు తగ్గట్టు ఇది నయీమ్ బయోపిక్ ఆ? లేదా మరొకరిదా? అనే ప్రశ్నలకు వర్మ సమాధానం చెప్పాలి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసిన వర్మ... ఈసారి ఎవరినీ టార్గెట్ చేశారో??