ట్రైలర్ కొత్తది.. విషయం పాతది!
on Sep 20, 2017
నాగార్జున.. ఇప్పటివరకూ టచ్ చేయని జానర్లో వస్తున్న సినిమా ‘రాజుగారి గది 2’. నాగార్జున హారర్ సినిమాలో చేయడమే ఇందులో కొత్తదనం. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... పాత హారర్ సినిమాలే గుర్తొస్తాయ్. కొత్తదనం అయితే ఏం కనిపించలేదు. ఓ ఇంట్లో దెయ్యం ఉండటం.. నలుగురు బకరాలు.. ఆ ఇంట్లోకెళ్లడం.. వాళ్లు ఆ దెయ్యంబారిన పడటం.. ‘చంద్రముఖి’లో రజనీకాంత్ వచ్చినట్లు.. ఆ దెయ్యాన్ని వదిలించడానికి నాగార్జున రావడం... ఈ ట్రైలర్ చూస్తే.. ఇవే మనకు కనిపించేది. మరి సినిమాలో ఇంకేమన్నా కొత్తగా ఉందేమో చూడాలి. మలయాళంలో రూపొందిన ‘ప్రేతమ్’ సినిమా.. దీనికి మాతృక అని తెలిసింది. ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే ఫార్ములా హారర్ కామెడీ. మరి ఆ ఫార్ములాలో తెరకెక్కిన ఈ చిత్రం అందరూ అనుకున్నట్లే ఆడియన్స్ ని అలరిస్తుందా? లేక చతికిల పడుతుందా? తెలుసుకోవాలంటే.. అక్టోబర్ 13 దాకా ఆగాల్సిందే.