నిజమే... రాజశేఖర్ ఆ సినిమా చెయ్యట్లేదు!
on Oct 17, 2019
తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో ఓ సినిమా చేయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ తమిళ నిర్మాత కూడా ముందుకొచ్చారు. దర్శక నిర్మాతలతో రాజశేఖర్, జీవిత రెండుమూడు సార్లు సమావేశం అయ్యారు. స్క్రిప్ట్ నుండి డైలాగుల వరకూ అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నారు. రాజశేఖర్ పక్కన నందితా శ్వేతను హీరోయిన్ గా సెలక్ట్ కూడా చేశారు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో సినిమా క్యాన్సిల్ అయింది. ఏమైందో ఏమో... రాజశేఖర్ ఆ సినిమా చెయ్యట్లేదు. కారణాలు తెలియవు గానీ, ఇప్పుడు కొత్త కథల కోసం రాజశేఖర్ చూస్తున్నారు. గరుడవేగ సినిమా తర్వాత కథల ఎంపికలో యాంగ్రీ స్టార్ తీరు మారింది. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కల్కి ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా... హీరోకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తన వయసుకు నప్పే, ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథల కోసం రాజశేఖర్ చూస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తితో ఆయన అనుకున్న సినిమాను ఇప్పుడు సుమంత్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్.