English | Telugu

ఆర్ఆర్ఆర్‌... ప్రెస్‌మీట్‌లో ముఖ్యాంశాలు ఏంటి?

on Mar 14, 2019

నందమూరి కథానాయకుడు ఎన్టీఆర్, కొణిదెల వారసుడు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా... మన తెలుగు ఇండస్ట్రీలో అసలు సిసలైన మల్టీస్టారర్...'బాహుబలి' తరవాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా... ఒకటా రెండా 'ఆర్ఆర్ఆర్‌' సినిమా ప్రత్యేకతలు ఎన్నో. భారతదేశంలో ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి గురువారం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి,  నిర్మాత డివివి దానయ్య ఫ్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యాంశాలు...

- 'ఆర్ఆర్ఆర్‌'లో యుంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, యంగ్ కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే... ఇద్దరి స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రేక్షకులకు తెలిసిన కథ కాకుండా, ఊహాజనిత కథతో సినిమా తెరకెక్కిస్తున్నారు.

- ఆంధ్రాలో అల్లూరి, ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ రెండు మూడేళ్ళ వ్యవధిలో జన్మించారు. ఇద్దరూ విడి విడిగా స్వాతంత్య సమర పోరాటంలో పాల్గొన్నారు. యుక్త వయసులో చనిపోయారు. ఒకవేళ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి కథ పుట్టిందని రాజమౌళి తెలిపారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అన్నమాట. ఒకవేళ ఇద్దరూ సినిమా చేయడానికి అంగీకరించకపోతే ఈ కథను పక్కనపెట్టి, మరో కథతో సినిమా తీసేవాడిని అన్నారు.

- రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైజీ ఎడ్గ‌ర్ జోన్స్‌ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.

- 'ఆర్ఆర్ఆర్‌' వర్కింగ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించడంతో దాన్ని సినిమా టైటిల్ గా ఖరారు చేశారు. అయితే... 'ఆర్ఆర్ఆర్‌' అనేదానికి ఏ భాషకు తగ్గట్టు ఆ భాషలో క్యాప్షన్ పెడతామని చెప్పారు. ఆ క్యాప్షన్ ను కూడా ప్రేక్షకులని చెప్పమని అడిగారు.

- సినిమాను జూలై 30, 2020న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలతో సహా దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేస్తామని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. ఇతర భాషల్లో, విదేశీ భాషల్లో విడుదల చేయమని డిమాండ్స్ వస్తున్నాయని, వాటిని పరిశీలిస్తామని ఆయన అన్నారు.

- రాజమౌళి దర్శకుడు కాబట్టే తాను, రామ్ చరణ్ కలిసి నటించే అవకాశం సుసాధ్యమైందని ఎన్టీఆర్ అన్నారు. తనకు, రామ్ చరణ్ కు మధ్య ఉన్న స్నేహం, స్నేహంపై ఉన్న నమ్మకం కూడా సినిమా చేయడానికి కారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమవీరుడు కొమరం భీమ్ ఏ మాండలికం మాట్లాడితే సినిమాలో తాను ఆ మాండలికం మాట్లాడతానని ఎన్టీఆర్ అన్నారు.

-  తెలంగాణ ఉద్యమవీరుడు కొమరం భీమ్, ఆంధ్ర గిరిజనుల కోసం పోరాడిన ఉద్యమవీరుడు అల్లూరి.. ఇలా ప్రాంతాలను కావాలని కలపలేదని, అనుకోకుండా ఆలోచన వచ్చిందని రాజమౌళి అన్నారు.

- డిసెంబర్ 2019కి సినిమా చిత్రీకరణ పూర్తిచేసేలా ప్లాన్ చేశామని రాజమౌళి తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి ఆరు నెలల టైమ్ పెట్టుకున్నామన్నారు.

- స్టోరీ ఐడియా తనదేనని రాజమౌళి అన్నారు. హాలీవుడ్ సినిమా 'మోటార్ సైకిల్ డైరీ' సినిమా చివర్లో హీరో పాత్ర చేగువేరా అని రివీల్ చేసే ట్విస్ట్ తనకు నచ్చిందని, అక్కడ ఈ కథకు బీజం పడిందని రాజమౌళి తెలిపారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here