రాజమౌళి చేస్తున్నది పెద్ద తప్పే...?
on Oct 23, 2020
ప్రేక్షకులకు 'ఆర్ఆర్ఆర్' విడుదల చేసిన కొమురం భీమ్ ఇంట్రో టీజర్ విపరీతంగా నచ్చింది. రాజమౌళి కాపీ చేసాడంటూ కొంతమంది ఆరోపణలు కూడా చేశారు. ప్రతి సినిమాకు సహజంగా ఇటువంటివి వస్తాయి. అయితే... చరిత్రకారులు 'రామరాజు ఫర్ భీమ్' టీచర్ మీద విమర్శలు చేస్తున్నారు. రాజమౌళి పెద్ద తప్పు చేస్తున్నాడని, చరిత్రను వక్రీకరించిన ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అసలు ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
భీమ్ ఇంట్లో టీజర్ చివర్లో ముస్లిమ్ యువకుడి ఆహార్యంలో ఎన్టీఆర్ కనిపించారు. దానిపై చరిత్రకారులు మండిపడ్డారు. ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటం చేసిన కొమురం భీమ్ అప్పట్లో నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అటువంటి ఉద్యమ నాయకుడిని ముస్లిం గా చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చరిత్రకి విరుద్ధమని, పెద్ద తప్పు చేస్తున్నారని సున్నితంగా రాజమౌళిని హెచ్చరిస్తున్నారు. త్వరలో కొమురం భీమ్ అభిమానులు రాజమౌళి కి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
బహుశా ఇటువంటి విమర్శలు వస్తాయని రాజమౌళి ముందే ఊహించారా ఏమో? అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుండి వచ్చిన కల్పిత గాథ అని ముందునుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత కల్పితమైనప్పటికీ... ప్రజలు, ముఖ్యంగా భీమ్ వారసులు హర్షిస్తారా అనేది పెద్ద ప్రశ్న?
ఓవైపు విమర్శలు వస్తుంటే... మరోవైపు ఎన్టీఆర్ ముస్లిం గెటప్ వెనుక పెద్ద ట్విస్ట్ ఉందనేది వినపడుతోంది. రజాకార్ల అడ్డాలోకి ముస్లిం యువకుడిగా వెళ్లి తాను అనుకున్నది కొమరం భీమ్ సాధించినట్టు రాజమౌళి చూపించాడనే ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజం అనేది సినిమా విడుదలైతే గానీ తెలియదు. ఈ విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ రాజమౌళి ముందుకు వెళుతున్నాడు.
Also Read