ENGLISH | TELUGU  

'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమా రివ్యూ

on Oct 11, 2019

 

నటీనటులు: తేజస్ కంచర్ల, పాయల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీనన్, వీకే నరేష్, నాగినీడు తదితరులు
పాటలు: భాస్కరభట్ల
మాటలు: వి. పరశురామ్  
సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
సంగీతం:రధన్ 
ప్రొడక్షన్ కంపెనీ: హ్యాపీ మూవీస్
నిర్మాత: సి. కళ్యాణ్ 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:శంకర్ భాను
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019

'ఆర్.డి.ఎక్స్. లవ్' టీజర్ హాట్ అయితే... ట్రైలర్ నీట్. టీజర్లో హీరోయిన్ అందాలను ఎక్కువ చూపిస్తే... ట్రైలర్లో ఊరి సమస్యలు, సందేశం అంటూ సామాజిక సినిమా అన్నట్టు చూపించారు. 'ఆర్.ఎక్స్. 100' తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ నటించిన చిత్రమిది. అసలు, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.   

కథ:

నలుగురు స్నేహితులతో కలిసి ప్రభుత్వ పథకాలకు అలివేలు (పాయల్ రాజ్‌పుత్‌) ప్రచారం చేస్తుంటుంది. అంటే... కండోమ్ (సినిమాలో సేఫ్టీ అని పిలిచారు) వాడకం గురించి వివరించడం, గుట్కా మాన్పించడం, మగాళ్లు సంసారం చేయాలంటే ఏం చేయాలో మహిళలకు వివరించడం వంటివి అన్నమాట. ఆమెను చూసి సిద్ధు (తేజస్ కంచర్ల) ప్రేమలో పడతాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అలివేలును అడిగితే... ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసమని చెబుతుంది. ముఖ్యమంత్రిని అలివేలు ఎందుకు కలవాలని అనుకుంటుంది? ఆమె లక్ష్యం ఏంటి? ఆమెకు సిద్ధు ఎలా సహాయ పడ్డాడు? అనేది సినిమా. 

విశ్లేషణ: 

'ఆర్.డి.ఎక్స్. లవ్' కంటే ముందు సినిమాలో ఓ సన్నివేశం గురించి చెప్పుకోవాలి. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశమది. నాభి అందాలు కనిపించేలా ఓ చెట్టు కింద హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. చెట్టు మీద తేనెపట్టు ఉంటుంది. ఓ చుక్క కింద నిద్రిస్తున్న హీరోయిన్ నాభి పక్కన పడుతుంది. ఆమె స్నేహితులు హీరోతో 'అలివేలు నిద్రపోతున్నప్పుడు అలా మీద ఏదైనా పడితే గోల చేస్తుంది. ఏదో ఒకటి చేసి తీసేయ్' అంటారు. అప్పుడు హీరోగారు పెదవులతో తేనెచుక్కను ఆస్వాదిస్తారు. స్నేహితులతో చాటుగా ఈ దృశ్యాన్ని వీడియో తీయించిన హీరోయిన్, హీరో తండ్రికి పంపిస్తుంది. హీరో తండ్రి దగ్గర పనిచేసే వ్యక్తి 'అబ్బాయిగారు రొమాంటిక్' అంటాడు. అందుకు బదులుగా హీరో తండ్రి 'ఇంత దిగజారుడు ఏంటి?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సినిమాలో సన్నివేశాల గురించి సింబాలిక్ గా చెప్పడానికి ఆ సన్నివేశంలో 'దిగజారుడు' అనే పదం రాశారో? హీరో తండ్రిని విలన్ గా చూపిస్తున్నారు కనుక రాశారో? కానీ, కరెక్టుగా రాశారు. సినిమాలో దిగజారుడు సన్నివేశాలు చాలా ఉన్నాయి. 

కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే 'అర్ధనారి' వంటి అర్థవంతమైన సినిమా తీసిన దర్శకుడి నుండి ఇటువంటి సినిమా రావడం ఆశ్చర్యపరుస్తుంది. కమర్షియల్ సక్సెస్ కోసం దిగజారి సన్నివేశాలు తీశారా? అనే అనుమానం కలుగుతుంది. దర్శకుడి ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ప్రభుత్వ పథకాల పేరుతో తీసిన సన్నివేశాలు అన్నీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలవడం కోసం ఆడపిల్ల అటువంటి పథకాలకు ప్రచారం చేయాలా? మరో మార్గం లేదా? అని ప్రేక్షకులకు సందేహం రావొచ్చు.దర్శకుడు ఈ దారిని ఎంచుకున్నాడని సరిపెట్టుకున్నా... ఆ దారిలో సరిగా ప్రయాణించాడా? అంటే అదీ లేదు. లక్ష్య సాధన కోసం హీరోయిన్ ఎంచుకున్న దారి సబబుగా అనిపించదు. దిగజారుడు కింద అనిపిస్తుంది. హీరో తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడానికి హీరోతో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు పంపాలా? చివర్లో ఆ దారిలో హీరోయిన్ ఎందుకు వెళ్ళింది? అనే విషయంలో ట్విస్ట్ ఇచ్చినా... అదేమంత గొప్పగా లేదు. అసలు కథలోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు. ట్విస్టుల సంగతి పక్కన పెడితే... సినిమా మెయిన్ కాన్సెప్ట్ రవితేజ 'భగీరథ' సినిమా కాన్సెప్టే. నిడివి ఎక్కువైంది. కండోమ్ వాడకం, వాత్సాయన కామసూత్ర ప్రచారం పక్కన పెడితే... కొన్ని సన్నివేశాల్లో డైలాగులు పర్లేదు. రధన్ పాటల్లో గుర్తుంచుకునేవి లేవు. నేపథ్య సంగీతం హింస పెట్టింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:
పాయల్ రాజ్‌పుత్‌
కొన్ని మాటలు

మైనస్ పాయింట్స్:
దర్శకత్వం
పాటలు, నేపథ్య సంగీతం
రవితేజ 'భగీరథ'ను గుర్తుచేసే కథ
ఓవర్ ది బోర్డ్ వెళ్లిన రొమాంటిక్ సీన్స్

  
నటీనటులు:  
హీరో హీరోయిన్ పాత్రలను వేర్వేరుగా చూస్తే ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ఇద్దర్నీ జంటగా చూస్తే కెమిస్ట్రీ కుదరలేదు. హీరో తేజస్ కంటే హీరోయిన్ పాయల్ పెద్దదిగా కనిపించింది. మిగతా నటీనటుల్లో ఆదిత్య మీనన్, నాగినీడు, నరేష్ బాగా చేశారు. అనుభవంతో పాత్రలను చేశారు. తులసి పాత్ర ఎమోషనల్ గా సాగుతుంది. 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
'ఆర్.ఎక్స్. 100'లో పాయల్ రాజ్‌పుత్‌ అందాలు చూసి... 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు రెండు పాటలు, రెండు మూడు సన్నివేశాలు తృప్తినిస్తాయి. అలాగే, టీజర్ చూసి సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు కూడా. కానీ, ట్రైలర్ చూసి సినిమాకు వెళితే మోసపోవడం ఖాయం. అందానికి, అసభ్యతకు మధ్య చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటి సినిమా తీశారు. కుటుంబంతో, పిల్లలతో కలిసి సినిమాకు వెళితే ఇబ్బందిపడతారు. ఇదొక చీప్ సన్నివేశాలు ఉన్న సినిమా.

రేటింగ్: 2/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.