ENGLISH | TELUGU  

వెండితెర కళాత్మక కావ్యం ‘పద్మావతి’!

on Jan 24, 2018

తారాగణం: దీపికా పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్...
దర్శకత్వం: సంజయ్ లీలా బన్సాలీ
నిర్మాణం:  బన్సాలీ ప్రొడక్షన్స్

కొత్త దనం కోసం తపించడం... దాని కోసం ఎంత శ్రమైనా భరించడం...  దర్శకునికి ఉండాల్సిన లక్షణాలు. నేటి దర్శకుల్లో ఎందరిలో ఉన్నాయ్ ఈ లక్షణాలు? అనడిగితే... దేశం మొత్తం మీద... ఓ ముగ్గురు నలుగురు పేర్లు మాత్రం చెప్పగలం. వారిలో ఒకడు సంజయ్ లీలాబన్సాలీ. 

ఖామోషి, హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, సవారియా, గుజారిష్, బాజీరావ్ మస్తానీ... ఇప్పుడు ‘పద్మావతి’... ఈ లిస్ట్ చూస్తే అర్థమైపో్తుంది దర్శకునిగా అతనేంటో.. 

బాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్...  బీమల్ రాయ్, హృషికేశ్ ముఖర్జీ, రాజ్ కపూర్, యాష్ చోప్రా, సుభాష్ ఘాయ్, రాజ్ కుమారి ఇరానీలకు ఏ మత్రం తీసిపోని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. అందులో నో డౌట్. ‘పద్మావతి’ సినిమా చూసిన ఎవరైనా ఈ మాటను కాదనలేరు. 

ఈ సినిమా విషయంలో జరిగిన అల్లర్లు కూడా అర్థం లేనివే అని తేలిపోయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని భావించారో.. వారందరూ రొమ్ము విరుచుకొని చూసేలా ఈ సినిమా తీశాడు సంజయ్ లీలా బన్సాలీ. అసలు ముందు... ‘పద్మావతి’ కథేంటో చూద్దాం. 

కథ:

సింహళ దేశపు యువరాణి పద్మావతిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు మేవార్ దేశపు రాజు.. రాజా రతన్ సింగ్. పెద్దల అంగీకారంతో పద్మావతిని రెండో భార్యగా స్వీకరిస్తాడు. పద్మావతీ సమేతంగా తన దేశ రాజధాని చిత్తోడ్ ఘడ్ కు చేరడంతో కథ మొదలవుతుంది. పద్మావతి, రతన్ సింగ్ ల ఏకాంతాన్ని చూడ సాహసించిన రాజగురువుకు పద్మావతి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తుంది. అవమాన భారంతో దేశాన్ని విడిచిన రాజగురువు... ఢిల్లీ సుస్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ పంచన చేరతాడు. పద్మావతి సౌందర్యం గురించి.. ఖిల్జీకి వివరించి... అతనికి పద్మావతిపై ఆశ కలిగేట్టు చేస్తాడు. దాంతో కేవలం పద్మావతి కోసమే... చిత్తోడ్ ఘడ్ పై  ఖిల్జీ  దాడికి తెగబడతాడు. తెలివిగా రతన్ సింగ్ ని బంధించి ఢిల్లీకి తీసుకెళ్తాడు. మహారాజు కావాలంటే... స్వయంగా పద్మావతే తన వద్దకు రావాలని షరతు విధిస్తాడు. భర్తను రక్షించుకోవడం కోసం పద్మావతే... ఢిల్లీ వెళుతుంది. ఖిల్జీ కంట కూడా పడకుండా... యుక్తితో భర్తను విడిపించి... చిత్తోడ్ ఘడ్ కు తెచ్చుకుంటుంది. ఈ ప్రయత్నంలో వేలాదిమంది రాజ్ పుత్ సైనికులు మృత్యువాత పడతారు. అయితే.. ఈ పరిణామాన్ని తీవ్రంగా భావించిన ఖిల్జీ... మళ్లీ చిత్తోడ్ ఘఢ్ పై దండెత్తుతాడు. అధర్మయుద్ధంతో రతన్ సింగ్ ప్రాణాలు తీస్తాడు.  పద్మావతిని చేజిక్కించుకోబోతాడు. ఆ తరుణంలో... పద్మావతితో పాటు.. రాజ్ పుత్ స్త్రీలందరూ అగ్నిలో దూకి ఆహుతైపోతారు. 

విశ్లేషణ:-
ఇదండీ పద్మావతి కథ. దక్షిణాది ప్రజల ఆరాధ్య దేవత వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కథ కూడా ఇలాగే ఉంటుంది. సో... కథ పరంగా చూస్తే పాతదే. కానీ... దీన్ని సంజయ్ లీలా బన్సాలీ తీర్చిదిద్దిన తీరు.. మాత్రం అమోఘం. ‘పద్మావతి’ రూపంలో ఓ వెండితెర అద్భుతాన్నే సృజించాడు సంజయ్. మనందర్నీ 13వ శతాబ్దంలోకి తీసుకెళ్లి.. ఆ పాత్రల మధ్య కూర్చోబెట్టి... అప్పుడు జరిగిన సంఘటనలకు మనల్ని కూడా సాక్షుల్ని చేశాడు. చరిత్ర తీయడం తేలికైన విషయం కాదు. అప్పటి వ్యక్తులనే కాదు.. వ్యవస్థను, వారి జీవన విధానాన్ని, ఆహార్యం..  వాతావరణం.. ఇలా ప్రతి విషయాన్నీ సునిశితంగా గమనిస్తే తప్ప చరిత్రకు న్యాయం చేయలేం. ‘పద్మావతి’ చూస్తే.. మనం కూడా ఆనాటికాలంలోకెళ్లిపోతాం. అసలు ఆ ఫ్రేమింగ్... ఆ లైటింగ్... ఓ అందమైన పెయింటింగ్ నే తలపించాయంటే నమ్మండి! సినిమా మొదలైన అయిదు నిమిషాలకే ప్రేక్షకుడు కథలో ఉంటాడు. ఎక్కడా ఒక్క వేస్ట్ సీన్ కనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్ అయితే... అనుక్షణం ఉత్కంఠే. పతాక సన్నివేశం అయితే రోమాంచితమే. నిజంగా కళాత్మక కావ్యం ‘పద్మావతి’. అందులో నో డౌట్. 

ఈ మధ్య కాలంలో నటీనటులకు బదులు... కేవలం పాత్రలే కనిపించిన సినిమా ఇదే. రణవీర్ సింగ్ నట విశ్వరూపం ఈ సినిమా. తెరపై ఎవ్వరూ రణవీర్ ని చూడలేదు. ఖిల్జీనే చూశారు. దీపిక పదుకొన్ కనిపించలేదు... పద్మావతే కనిపించింది. రాజా రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ కూడా చాలా బాగా చేశాడు. 

సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలున్న సినిమా ఇది. ఇది బాగాలేదు అని చెప్పడం సాహసమే. సంజయ్ గత చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ ని మించిన అద్భుతం ‘పద్మావతి’. దర్శకులపై గౌరవాన్ని మరింత పెంచిన సినిమా ఇది. నేటి దర్శకులందరూ ఒక్కసారి చూడాల్సిన సినిమా.. ‘పద్మావతి’. 

రేటింగ్: 4/5 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.