18 ఏళ్ళ ఒక్కడు
on Jan 15, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మేలి మలుపు తిప్పిన చిత్రం.. ఒక్కడు. కబడ్డీ ప్లేయర్ గా మహేష్ నటించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో అతనికి జోడీగా భూమిక నటించగా, ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ దర్శనమిచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి.
ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు (శేఖర్ వి. జోసెఫ్), ఉత్తమ కళా దర్శకుడు (అశోక్ కుమార్), ఉత్తమ ఎడిటర్ (ఎ. శ్రీకర్ ప్రసాద్), ఉత్తమ నృత్య దర్శకుడు (రాజు సుందరం), ఉత్తమ ఫైట్ మాస్టర్ (విజయన్).. ఇలా ఎనిమిది విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న ఒక్కడు.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను వశం చేసుకుంది. అలాగే మరెన్నో పురస్కారాలు ఈ చిత్రానికి దక్కాయి.
ఇక గిల్లి పేరుతో తమిళంలో, అజయ్ పేరుతో కన్నడలో, జోర్ టైటిల్ తో బెంగాలీ, తేవర్ పేరుతో హిందీలో ఒక్కడు రీమేక్ అయింది. 2003 జనవరి 15న విడుదలై ఘనవిజయం సాధించిన ఒక్కడు.. నేటితో 18 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.