English | Telugu

ఒక్క క్షణం మూవీ రివ్యూ

on Dec 28, 2017

తారాగణం; అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం:  వీఐ ఆనంద్
నిర్మాత: చక్రి చిగురుపాటి

ఒకప్పుడు వినోదమంటే సినిమానే. ఇప్పుడు కాదు. అందుకే... ఎంతో బావుంటే కానీ.. సినిమాకు టాక్ రావట్లేదు. హీరో అనేవాడు పెద్ద స్టార్ అయితే గానీ జనాలు థియేటర్ల వంక చూడటం లేదు. దీనికి తోడు వారం తిరిగే సరికి సదరు కొత్త సినిమా టీవీల్లో వచ్చేస్తోంది. దాంతోె విడుదలయ్యే ప్రతి సినిమాపైనా... దృష్టి పెట్టాల్సిన అవసరం జనాలకు లేకపోయింది.

అంచేత చెప్పేదేంటంటే... సినిమాను ‘అద్భుతం’గా అయినా తీయాలి... లేకపోతే.. సదరు హీరో.. అశేష అభిమానగణం ఉన్న వాడైనా అయ్యుండాలి. అప్పుడు కానీ.. థియేటర్లు నిండవ్.

చిన్న హీరోల నటించిన సినిమా ఫర్వాలేదనిపించేలా ఉంటే... జనాలు వారం ఆగి టీవీల్లో చూసేస్తున్నారు. అదనమాట విషయం.

ఈ గురువారం ‘ఒక్కక్షణం’ అనే సినిమా విడుదలైంది. ఇందులో హీరో అల్లు శిరీష్. వీఐ ఆనంద్ దర్శకుడు. శిరీష్ మంచి బ్యాగ్రౌండ్ ఉన్న హీరోనే అయినా.. ఇంకా అభిమానుల దృష్టి కుర్రాడిపై పడలా. మరి అలాంటప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే ఎలా ఉండాలీ... ‘అద్భుతహ’ అనిపించాలి. మరి ‘ఒక్క క్షణం’ అలా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం.

కథ:
తొలి చూపులోనే ఓ జంట ప్రేమలో పడుతుంది. వీరి రొమాంటిక్ ప్రేమ ప్రయాణంలో ఊహించని, నమ్మశక్యం కాని ఓ నిజాన్ని వీరిద్దరూ గమనిస్తారు.. అదేంటంటే.. వారికి తెలిసిన మరో జంట జీవితంలో జరిగే సంఘటనలే యాజిటీజ్ గా వీళ్లకు జరుగుతుంటాయ్. అంటే... కోటానుకోట్లుగా రకరకాల జీవితాలున్న ఈ భూమండలంలో...సామాంతర జీవితాలు (parallel lives) కూడా ఉంటాయ్. అలా వారికి చేరువగా ఉన్న ఓ జంట జీవితంలో జరిగిన సంఘటనలే వీరిద్దరికీ కూడా జరుగుతుంటాయ్. దీంతో వారికి ఫ్యూచర్ అర్థమైపోతుంటుంది. అక్కడ భర్త...భార్యను చంపేస్తాడు. అంటే.. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. ఈ పరిణామం..ఆ జంటలో కల్లోలం సృష్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
దర్శకుడు కొత్తగా ఆలోచిద్దామని ప్రయత్నించాడు. కథ తయారు చేసుకునే క్రమంలో కొంతవరకూ కొత్తగానే వెళ్లాడు. మళ్లీ ఏమైందో ఏమో... మన పాత కథల ప్రభావంలో పడిపోయాడు. ఈ కారణం చేత.. తడబడి... తత్తరబడి...చివరకు ఒకటిక్కెట్టుపై రెండు సినిమాలు చూపించాడు. ఫస్టాప్ కొత్తగా ఆలోచించాడని ఆనందించడానికి కూడా లేదు. ఎందుకంటే... కథలోకెళ్లడానికి మనోడికి 40 నిమిషాలు పట్టింది. ఈ సమయం అంతా పాత్రల్నిపరిచయం చేయడమే సరిపోయింది. ప్రేక్షకుల సహనానికి అదో పెద్ద పరీక్ష. ఇంట్రవెల్ పడిసరికి... ఏదో కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడని అందరూ భావించారు.. ఆశపడ్డారు. కానీ.. మనోడు... సెకండాఫ్ లో పురావస్తు తవ్వకాల్లో బయపడ్డ పాత కథను చూపించి అందరి ఆశల్లో నీళ్ల జల్లాడు. కామెడీ ఏంటంటే... సెకండాఫ్ లో చూపించిన ఆ పాత కథే కాస్త బావుందనిపించింది.

శిరీష్ నటన బావుంది. గత సినిమాలతో పోలిస్తే ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ సురభి, కథకు వెన్నెముక లాంటి పాత్ర పోషించిన  శ్రీనివాస్ అవసరాల కూడా చక్కగా నటించారు. సాంకేతికంగా నేపథ్య సంగీతం బావుంది. ఎడిటర్ కి ఇంకా కాస్త పనుందనిపించింది. కెమెరా వర్క్ బావుంది.

టోటల్ గా ఈ సినిమా అద్భుతమైతే కాదు. ఫర్వాలేదనిపించే సినిమా. చూడొచ్చు.

పంచ్ లైన్: ‘ఒక్క క్షణం’  ఒక టికెట్ పై రెండు సినిమాలు

రేటింగ్: 2/5

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here