English | Telugu

నిను వీడని నీడను నేనే సినిమా రివ్యూ

on Jul 12, 2019

నటీనటులు: సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, ప్రగతి  తదితరులు 
మాటలు: సామ్రాట్
పాటలు: రామజోగయ్య శాస్త్రి, నీరజ కోన, సామ్రాట్
సినిమాటోగ్రఫీ: ప్రమోద్ వర్మ
సంగీతం: ఎస్.ఎస్. తమన్
సమర్పణ: అనిల్ సుంకర 
నిర్మాతలు: సందీప్ కిషన్, సుప్రియ కంచెర్ల
దర్శకత్వం: కార్తీక్ రాజు
విడుదల తేదీ: 12 జూలై 2019

ఐదారేళ్ల క్రితం హారర్ కామెడీలు కాసులు కురిపించాయి. తర్వాత హారర్ ట్రెండ్ ముగిసింది. సరైన హారర్ కథతో, కొత్తగా సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూస్తారని, విజయం తథ్యమని  'ఆనందో బ్రహ్మ' వంటి చిత్రాలు నిరూపించాయి. రెండు మూడేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్, 'నిను వీడని నీడను నేనే' అంటూ హారర్ కథతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో నటించడంతో పాటు అతడే నిర్మించాడు. సందీప్ కిష‌న్‌ని అంత‌లా ఈ చిత్రకథలో ఆకట్టుకున్నది ఏంటి? సినిమా ఎలా ఉంది?

 

కథ:

అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్యా సింగ్)ది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత మాధవి తొలి పుట్టినరోజుకు ఒక రిసార్టులో స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తాడు అర్జున్‌. తర్వాత కారులో సిటీకి తిరిగి వస్తుండగా, యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదానికి గురైన చోటు ఒక స్మశానం ఉంటుంది. ఇంటికివెళ్లిన తర్వాత అద్దంలో చూసుకుంటే అర్జున్‌కు రిషి (వెన్నెల కిశోర్‌), మాధ‌వికి రిషి భార్య‌ కనిపిస్తారు. వాళ్లు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించిన అర్జున్, మాధవికి కార్ ప్రమాదంలో తాము రోడ్డు ప్రమాదంలో మరణించామనే వార్త పేప‌ర్‌లో కనిపిస్తుంది. రిషి, దియా ఎవరు? అర్జున్, మాధవి మరణించారనే వార్త ఏంటి? ఈ చిక్కుముడులకు సమాధానమే 'నిను వీడని నీడను నేనే'.  

 

ప్లస్ పాయింట్స్:

స్టోరీ కాన్సెప్ట్
కథలో మలుపులు
సందీప్ కిషన్ నటన 
తమన్ స్వరాలు, నేపథ్య సంగీతం

 

మైనస్ పాయింట్స్:

అసలు కథలో వేగం ఏది?
సెకండాఫ్‌లో కామెడీ
హీరోయిన్ & లాజిక్స్

 

విశ్లేషణ:

మురళీశర్మ కొత్త విషయం ఏదో చెబుతున్నట్టు కథ మొదలైనా... హీరోయిన్‌ని ఏడిపించిన వాళ్లను హీరో కొట్టడం, తర్వాత రొమాంటిక్ సాంగ్ రావడం చూసి 'టేకాఫ్ బావుంది కానీ, ఇదీ రొటీన్ చిత్రమే' అనుకునేలోపు అద్దంలో హీరోకి వేరే వ్యక్తి కనిపిస్తే? అనే పాయింట్ దగ్గరకు దర్శకుడు తీసుకు వెళ్లాడు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఆత్మలు వీళ్ల దేహాల్లో ప్రవేశించాయా? అసలు, ఏం జరిగి ఉంటుంది? అనే పాయింట్ చుట్టూ ఇంటర్వెల్ వరకూ ఆసక్తికరంగా కథను నడిపించాడు. అలా అని మరీ సీరియ‌స్ నోట్‌లో వెళ్ల‌కుండా మధ్యలో మధ్యలో 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణమురళి చేత వినోదం పండించాడు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి మేజర్ ట్విస్ట్ ఇచ్చాడు. సందీప్ కిషన్ ఈ సినిమాతో ఎందుకు నిర్మాతగా మారాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. టికెట్ రేటుకు స‌రిప‌డా శాటిస్‌ఫ్యాక్ష‌న్ ప్రేక్షకుడికి వ‌స్తుంది. అప్పటివరకూ చూపించిన సన్నివేశాల్లో కొన్ని లాజిక్స్ మిస్ అయినా మంచి థ్రిల్ ఇచ్చారని సరిపెట్టుకోవచ్చు. అసలు ఆత్మ ఎవరు? మనిషి ఎవరు? అని ఇంటర్వెల్ ముందు క్లారిటీ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తే... అర్థం పర్థం లేని కామెడీతో దర్శకుడు కాసేపు విసుగు పుట్టించాడు. మళ్లీ కథ గాడిలో పడినా వేగం నెమ్మదించింది. అలాగే... తల్లిదండ్రులతో హీరో హీరోయిన్లకు అనుబంధాన్ని, పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలను మరింత బలంగా చెప్పాల్సింది. అయినా... క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగింది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... తమన్ మంచి పాటలు, నేపథ్య సంగీతం అందించాడు. హారర్ సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఇరగదీశాడు. ప్రమోద్ వర్మ సినిమాటోగ్రఫీ సూపర్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

నటీనటుల పనితీరు:

నటుడిగా సందీప్ కిషన్ చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. ఫైట్‌లో స్టైలిష్‌గా క‌నిపించాడు. తరవాత హారర్ సన్నివేశాల్లో భయాన్ని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆత్రుతను ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా చూపించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. లుక్స్, యాక్టింగ్ పరంగా హీరోయిన్ జస్ట్ ఏవరేజ్. బెస్ట్ యాక్టర్ ఎవరినైనా తీసుకుంటే బావుండేది. 'వెన్నెల' కిశోర్, పోసాని పాత్రలకు తగ్గట్టు నటించి నవ్వించారు. కథను ముందుకు నడిపించారు. మురళీశర్మకు ఇటువంటి  పాత్ర కొత్త ఏమీ కాదు. ప్రగతి పాత్ర పరిధి తక్కువే.

 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

స్టోరీ కాన్సెప్ట్, కథలో మలుపులు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లో అనవసరమైన కామెడీ, నిదానంగా సాగిన కథనం  కొంచెం బోర్ కొట్టిస్తాయి. అయితే... చివరకు మంచి థ్రిల్ ఇస్తుందీ సినిమా. హారర్ జాన‌ర్‌లో ఇదో కొత్త ప్రయోగం. థియేటర్లకు వెళ్లి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5


Cinema GalleriesLatest News


Video-Gossips