చేస్తే నేను చేయాలి, చైతు చేయడమేంటి?
on May 2, 2018
అక్కినేని నాగార్జున సావిత్రి బయోపిక్ మహానటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాని తో పాటు గెస్ట్ గా విచ్చేసారు. తనకు సావిత్రి గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న నాగ్, 8 నెలల బాబుగా ఉన్నప్పుడు సావిత్రి వెలుగు నీడలు సినిమాలో తనని ఎత్తుకొని సినిమాలకి పరిచయం చేసిందని గుర్తు చేసాడు. సావిత్రి అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని, అయితే తాను మాత్రం వచ్చిన ప్రతి సారి ఎందుకో తెలియని సిగ్గుతో సోఫా వెనకాలకి వెళ్లిపోయేవాడినని వివరించాడు. సావిత్రి గారి పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ తాను మాత్రం నాన్నగారిని ఫంక్షన్లో బాగా మిస్ అవుతున్నానని చెప్పారు. ఇక మహానటిలో తనకి ఒక అవకాశం ఇస్తే బాగుండేదని, అసలు నాన్న గారు క్యారెక్టర్ చేస్తే గీస్తే నేను చేయాలి కానీ నాగ చైతన్య చేయడం ఏంటి అని సరదాగా అన్నారు. అయినా తన వయసుకి ఆ క్యారెక్టర్ సెట్ అయ్యేది కాదని వివరించాడు. తన కుటుంబ సభ్యులయిన నాగ చైతన్య, సమంత ఇద్దరు సావిత్రి బయోపిక్ లో భాగం అవ్వడం తనకి చాల సంతోషాన్నిచ్చిందని అన్నారు. సమంత ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసిన విషయం మనకి తెలిసిందే. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహానటి ఈ నెల 9 కి ప్రేక్షకుల ముందుకి రానుంది.