ENGLISH | TELUGU  

పడుతూ లేచిన కెరటం... నవ చైతన్యం!

on Nov 23, 2019

 

ఏయన్నార్... మూడు అక్షరాలు! తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఓ కన్ను అయితే... అక్కినేని మరో కన్ను. ఇద్దరూ ఇద్దరే. ఏయన్నార్ ఓ నటనాలయం! నటనలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత  వ్యక్తి. ఆయన వారసుడిగా, తండ్రి నాగార్జున బాటలో నడుస్తూ హీరోగా వచ్చాడు నాగచైతన్య. మేనమామ వెంకటేష్ కూడా హీరోయే. అమ్మ తరపు తాతయ్య దగ్గుబాటి రామానాయుడు దిగ్గజ నిర్మాత. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండు బలమైన కుటుంబాల నేపథ్యం నుండి రావడంతో నాగచైతన్యపై ప్రేక్షకుల్లో... అక్కినేని, దగ్గుబాటి అభిమానుల్లో  తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కెరీర్ ఆరంభంలో కొంత తడబడినా... ఇప్పుడు అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ, ప్రేక్షకులందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

నాగచైతన్య తొలి సినిమా 'జోష్'. భారీ అంచనాల నడుమ విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ ఆశించిన విజయం అందించలేకపోయింది. అక్కినేని వారసుడి అభినయంపై విమర్శలొచ్చాయి. ఫలితం కంటే పైన వచ్చిన విమర్శలు అభిమానులను ఎక్కువ బాధించాయి. మరో కొత్త హీరో అయితే కుంగిపోయేవాడు ఏమో... ఐదు అంటే ఐదే నెలల్లో నాగచైతన్య 'ఏ మాయ చేసావె'తో వచ్చాడు. విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పడి లేచిన కెరటంలా దూసుకొచ్చాడు. తర్వాత ఏడాది '100% లవ్'తో మరో హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నాగచైతన్య సెటిల్ అయినట్టే అనుకున్నారు. కానీ, ఆ తర్వాత చేసిన 'దడ', 'బెజవాడ' పరాజయాలు అందించాయి. మళ్లీ 'తడాఖా'తో మరో విజయాన్ని అందుకున్నాడు. 

తాతయ్య ఏయన్నార్, తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'మనం' మధురమైన విజయాన్ని, అంతకు మించి మనీతో వెలకట్టలేని ఎన్నో మధుర జ్ఞాపకాల్ని అందించింది. ఒక హిట్, తర్వాత ప్లాప్... మళ్ళీ హిట్, తర్వాత రెండు ప్లాప్స్... ఇలా చూస్తుండగానే ఈ ఏడాది సెప్టెంబర్ 5కి అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చి పదేళ్లు పూర్తయ్యాయి. పదేళ్లలో 'ప్రేమమ్', రారండోయ్ వేడుక చూద్దాం', 'మజిలీ' వంటి మంచి మంచి సినిమాలు చేశాడు.

హీరోగా అక్కినేని నాగచైతన్య పదేళ్ల కాలాన్ని రెండు భాగాలుగా విభజించి చూస్తే... ఫస్టాఫ్‌లో యాక్షన్ హీరో ఇమేజ్ కోసం అతడి ప్రయత్నించిన ప్రతిసారీ కింద పడ్డాడు. మళ్ళీ ఓ ప్రేమకథతో, మంచి కుటుంబ విలువలు ఉన్న సినిమాతో పైకి లేచాడు. ఫస్టాఫ్ చివర్లో ఫుల్ యాక్షన్ సినిమా 'దోచెయ్' తీవ్ర నిరాశకు గురి చేసింది. మళ్ళీ కింద పడ్డాడనీ, ఇక పైకి లేవడం కష్టమని విమర్శకులు అనుకున్నారు. అయితే అప్పటికే రెండుసార్లు పడి లేచాడు. మళ్ళీ లేచాడు. 

సెకండాఫ్‌ను 'ప్రేమమ్' హిట్‌తో స్టార్ట్ చేశాడు. ఈసారి నాగచైతన్యలో మార్పు కనిపించింది. క్లాసులో మాస్ చూపించడం మొదలుపెట్టాడు. 'ప్రేమమ్' క్లాస్ ఫిల్మ్. కానీ, నాడులో ఫైట్స్ చూడండి. మాసీగా ఉంటాయి. 'సవ్యసాచి', 'యుద్ధం శరణం' చిత్రాలను మినహాయిస్తే... 'సాహసం శ్వాసగా సాగిపో', 'శైలజారెడ్డి అల్లుడు', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'మజిలీ' చిత్రాల్లో నాగచైతన్య యాక్షన్ సీన్స్ లో పేరు తెచ్చుకున్నాడు. అక్కినేని హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. దాన్నుంచి దూరంగా జరగకుండా... యాక్షన్ తో కూడిన రొమాంటిక్ సినిమాలు చేస్తున్నాడు. 

పదేళ్లలో నాగచైతన్య సాధించిన ఘనత ఏంటంటే... నటుడిగా పరిణితి సాధించడం. అందుకు 'మజిలీ' మంచి ఉదాహరణ. భావోద్వేగాలన్నీ ఉన్న కథలను ఎంపిక చేసుకోవడంలో పట్టు సాధించడం. అన్నిటి కంటే ముఖ్యంగా ఎన్నిసార్లు కిందపడి, కెరటంలా ఎన్నిసార్లు పైకి లేచినా... సముద్రంలా నిశ్చలంగా ఉండటం నాగచైతన్యలో మంచి లక్షణం. అతడు ఎప్పుడూ పరాజయాలకు కుంగిపోలేదు. విజయాలకు పొంగిపోలేదు. చిరునవ్వుతో సింపుల్ గా ఉన్నాడు. నటుడిగానే కాదు, వ్యక్తిగానూ ప్రేక్షకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు నాగచైతన్యలో పదేళ్ల అనుభవంతో పాటు నూతన ఉత్సాహం, చైతన్యం కనిపిస్తున్నాయి. ఇకనుండి వరుస విజయాలతో మరింత ముందుకు దూసుకు వెళ్లాలని ఆశిస్తూ, తెలుగువన్ డాట్ కామ్ తరపున అక్కినేని నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.