English | Telugu

నా పేరు సూర్య మూవీ రివ్యూ

on May 4, 2018

 

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, శరత్ కుమార్, అర్జున్

దర్శకత్వం : వక్కంతం వంశీ

నిర్మాత : శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీషా లగడపాటి

సంగీతం : విశాల్-శేఖర్

సినిమాటోగ్రఫర్ : రాజీవ్ రవి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

దేశభక్తి, మిలటరీ నేపథ్యంలో కథను ఎంచుకొని తెరకెక్కించడం తేలికైన విషయం కాదు. దక్షిణాదిన ఈ తరహా కథలకు విజయాలు కూడా తక్కువే. ఎన్టీయార్ ‘బొబ్బిలిపులి’ తర్వాత ఆ స్థాయి విజయాలందుకున్న సినిమాలు లేవ్.  ఈ తరహా కథలు... డ్రైగా అనిపించడమే అందుకు కారణం. అయితే... బాలీవుడ్ లో ఇలాంటి నేపథ్యంలో కొత్త కొత్త కథలొచ్చాయ్. మంచి విజయాలు కూడా అందుకున్నాయ్.  


ఇంతటి ప్రమాదకరమైన నేపథ్యాన్ని తొలి సినిమాకే ఎంచుకొని ఓ విధంగా సాహసమే చేశాడు దర్శకుడు వక్కంతం వంశీ. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలందించిన వక్కంతం... దర్శకునిగా చేసిన తొలి ప్రయత్నం ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’. అల్లు అర్జున్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాత. మెగా బ్రదర్ నాగబాబు సమర్పకుడు. ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం జనం మెచ్చేలా ఉందా? లేదా? అని తెలుసుకునేముందు.. కథేంటో చూద్దాం.

కథ

ప్రతి సైనికునిలో కచ్చితంగా ఉండే లక్షణాలు దేశభక్తి, దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని తెగువ, ధైర్యం, సమయస్పూర్తి, ఓర్పు, సహనం. సైనికుడు సూర్యలో ఓర్పు, సహనాలు మినహా మిగతావన్నీ పుష్కలంగా ఉన్నాయ్. దేశాద్రోహులను చంపి శవాలతో మాట్లాడేంత కోపం సూర్యా సొంతం. ఆ కోపమే... సూర్యను డిస్మిస్ అయ్యేలా చేసింది. బోర్డర్ లో నిలబడి దేశం కోసం పోరాడాలనేది సూర్య జీవితాశయం.  ఆ కోరిక తీరకముందే సూర్య ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సూర్యకు మళ్లీ ఉద్యోగంలో చేర్పించడానికి అతన్ని పెంచిన గాడ్ ఫాదర్ చేయని ప్రయత్నం లేదు. కానీ.. సైనికాధికారి మాత్రం ససేమిరా అన్నాడు. చివరకు ఓ షరతు మీద మళ్లీ సూర్యని సైన్యంలోకి చేర్చుకోవడానికి సైనికాధికారి ఒప్పుకున్నాడు. ఆ షరతేంటంటే.. ‘సూర్య మానసికంగా బాగానే ఉన్నాడు.. అని ఓ వ్యక్తి సర్టిఫై చేయాలి. ఆయన సర్టిఫై చేసిన రిపోర్ట్,.. అందులో ఆయన సంతకం చూశాకే.. సూర్యాని సైన్యంలోకి తీసుకుంటాం‘.. ఇనేది  షరతు. సూర్యను సర్టిఫై చేసే వ్యక్తి పేరు రామకృష్ణరాజు. ప్రముఖ సైకాలజీ ప్రొఫెసర్. ఆయన సంతకం కోసం సూర్య వైజాగ్ వెళ్లాడు. మరి వైజాగ్ వెళ్లిన సూర్య... రామకృష్ణంరాజు పెట్టే పరీక్షలో నెగ్గాడా? అసలు ఈ రామకృష్ణంరాజు ఎవరు? వైజాగ్ వెళ్లిన సూర్యకు ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

సరిహద్దుల్లో ఉండి.. శత్రుసైన్యంతో పోరాడే సైనికుడు... అనుకోకుండా దేశంలోకొచ్చి... లోపలున్న దేశద్రోహులతో పోరాడటం.. ధర్మసంస్తాపన చేయాడం...  ప్రజల్లో దేశభక్తి పెంపొందించడం గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఆ విధంగా చూసుకుంటే లైన్ పాతదే. అయితే... కథనం, పాత్రల తీరుతెన్నులు మాత్రం కొత్తగా ఉన్నాయ్. అదే  ‘నా పేరు సూర్య’కు బలం. ముఖ్యంగా ఫస్టాప్ లో... సూర్య పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలు అభిమానులకు బాగా ఆకట్టుకుంటాయ్. అంతేకాదు... తండ్రి, కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కట్టిపడేస్తాయ్.

అయితే... సెకండాఫ్ లో కథ పూర్తిగా ట్రాక్ తప్పిందనే చెప్పాలి. కోపాన్ని వదులుకోడం, కేరక్టర్ వదులుకోడం.. ఈ రెండికీ తేడా ఏంటో కూడా తేలియనంత అమాయకంగా కథను నడిపించాడు దర్శకుడు. అంతేకాదు.... పదేళ్ల తర్వాత తిరిగొచ్చిన కొడుకును చూడగానే తండ్రి గుర్తిస్తాడు తప్ప... తల్లి గుర్తించకపోవడం ఇక్కడ కామెడీ. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుల్లో దేశభక్తి రగించాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ.. ఏ సన్నివేశం కూడా ఆ స్థాయి ఉద్వేగాన్ని కలిగించదు. ఓ విధంగా చెప్పాలంటే... కథ చూస్తున్నట్లు కాకుండా.. కథ వింటున్నట్టు అనిపించింది. అంతేకాదు... సెకండాఫ్ లో బాగా విసుగుపుట్టించాడు కూడా.  స్క్రిప్ట్ దశలోనే వక్కంతం .. ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బావుడ్ననిపించింది.

ఇక పాత్రధారుల విషయానికొస్తే... బన్నీ తన సహజసిద్ధమైన నటనతో మళ్లీ శభాష్ అనిపించాడు. సీనియర్ హీరోలు అర్జున్, శరత్ కుమార్ లకు ధీటుగా నటించాడనే చెప్పాలి. సైనికుడిగా ఓ విభిన్నమైన నటన కనబరిచాడు. ఇక ఈ సినిమాలో నటన పరంగా హైలైట్ అంటే మాత్రం కచ్చితంగా అర్జునే. మాట వినని కొడుకును బాగు చేసుకోవాలనే తపించే తండ్రిగా, ఓ కుటుంబ పెద్దగా, దేశం గర్వపడే స్థాయిలో ఉన్న ఓ విధ్యాధికునిగా తన  పాత్రలో ఒదిగిపోయి నటించాడాయన. శరత్ కుమార్ చాలాకాలం తర్వాత మళ్లీ విలన్ గా మెరిపించాడు. అను ఇమ్మానియేల్ చాలా అందంగా ఉంది.

సాంకేతికంగా చెప్పుకుంటే... విశాల్ శేఖర్ సంగీతం. పాటల కంటే నేపథ్య సంగీతం బావుంది. హీరో కేరక్టర్ని ఎలివేట్ చేసేలా రీ రికార్డింగ్ ఇచ్చాడు. ప్రేక్షకులకు ‘అర్జున్ రెడ్డి’ రీ రికార్డింగ్ గుర్తొస్తుంది. రాజీవ్ రవి, సుశీల్ చౌదరిల కెమెరా వర్క్ కూడా బావుంది. సాంకేతికంగా అన్ని విభాగాల వారూ చక్కగా రాణిచారు. 

ఇక మొత్తంగా చెప్పాల్సొస్తే... సూర్య మనీ తెచ్చిపెట్టే  సినిమా అవుతుందేమో కానీ... మనసుల్ని మెప్పించే సినిమా మాత్రం కాదు.

రేటింగ్: 2.5

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here