ఎంతైనా ఆ తాత మనవడేగా!
on Sep 14, 2017
‘ఏమంటివి? ఏమంటివి? మానవజాతి నీచమా? ఎంత మాట! ఎంత మాట!’ తారక్... తాతకు తగ్గ మనవడు అనడానికి ఈ ఒక్క డైలాగు చాలు. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఈ డైలాగు ఈ రేంజ్ లో చెప్పగలిగే దమ్మున్న హీరో ఎవరండీ? చెప్పండి? ఆ మాటకొస్తే... వీళ్లకి తెలుగే సరిగా రాదు. ఇక సమాస భూయిష్టమైన భాషని ఏం చెబుతారు? ఒక్కసారి వింటే... మనసుకి ఎక్కించేసుకునేవాడ్ని... ‘ఏక సంతాగ్రహి’ అంటారు. ఎన్టీయార్ కూడా అలాంటివాడే. ‘రాఖీ’ సినిమాలో రైల్వే వ్యవస్థ గురించి ఓ పేజీ డైలాగ్ ఉంది. దాదాపు మూడు నిమిషాల సీన్. కట్ లేకుండా ఒకే టేక్ చెప్పి.. కోటా శ్రీనివాసరావు లాంటి నటుడ్నే విస్తూపోయేలా చేసిన ఘనడు కదూ తారక్! మరి ఎన్టీయారా? మజాకా?
అసలు కొన్ని సినిమాల్లో తారక్ అభినయం చేస్తుంటే... అన్నగారు గుర్తొస్తుంటారు. ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, టెంపర్... ఇలా కొన్ని సినిమాలున్నాయ్. అసలు పెద్దాయనే వచ్చేసి.. ఈ పిల్లాడిలో పూనాడా? అనిపించేలా ఉంటుంది వాటిల్లో తారక్ అభినయం. ఎంతైనా ఆ తాత మనవడే కదా. ‘స్టూడెంట్ నంబర్ వన్’ కోసం... తొలిసారి ఎన్టీయార్ ని చూసిన రాజమౌళీ.. ‘ఫస్ట్ సినిమాకు.. వీడు దొరికేడేంట్రా బాబూ’ అనుకున్నాట్ట. నిజానిక్కూడా అప్పట్లో అలాగే ఉండేవాడు.. సిలండర్ లా. కానీ... తర్వాత ఎలా మారాడూ! అగ్నిలో పుటం వేస్తే కానీ... బంగారానికి వన్నె రాదు. లక్షల ఉలిదెబ్బలు తింటే కానీ... శిల శిల్పంగా మారదు. తారక్ కూడా అంతే. ఇక్కడ తానే ఓ శిల.. తానే ఓ శిల్పి. అంత కష్టపడ్డాడు కాబట్టే.. ఇప్పుడు ఇలా ఉండగలిగాడు. అంగికం, వాచకం, ఆహార్యం.. ముడింటిలోనూ ఇప్పుడు తారక్ సూపర్. ఇక డాన్సులంటారా? నాకు తెలిసి.. ఇప్పటి హీరోల్లో తారక్ లాంటి డాన్సర్ లేడనే చెప్పాలి. బేసిగ్గా క్లాసికల్ డాన్సర్ అయిన బుడ్డొడికి... ఈ సినిమా డాన్సులు ఓ లెక్కా?
వంక పెట్టలేనంత గొప్ప నటుడు ఎన్టీయార్. పెద్దాయన గురించి కాదండోయ్! ఈ చిన్నాయన. ఇది అదీ అని కాదు... ఏదైనా చేసేసే నటుడు. పాత్రల పరంగా ప్రయోగాలు చేయగలిగే సత్తా ఉన్న నటుడు. కానీ... మూసగానే వెళ్తున్నాడు. అదే బాధకరం. ఈ మధ్య కాస్త పర్లేదులేండి. కొత్తగా ట్రై చేస్తున్నాడు. రాబోతున్న ‘జై లవకుశ’లో ఏకంగా మూడు పాత్రలు. ఒకదానితో ఒకటి పోల్చేలేనంత వైరైటీ పాత్రలు. తెరపై తారక్ సత్తా మరోసారి తేటతెల్లం చేసే పాత్రలు. అభిమానులకు నేత్ర పర్వమే అనాలి.
అసలు ఇప్పుడు కాదండీ... కెరీర్ మొదట్లోనే మోయలేనంత బరువైన పాత్రలు చేసేశాడు. వాళ్ల బాబాయ్ కి సూటయ్యే పాత్రల్ని పట్టుమని పాతికేళ్లు కూడా లేని వయసులో ఊది పారేశాడు. ఆది, సాంబా, సింహాద్రి, అశోక్, రాఖి.. ఇవన్నీ అలాంటి పాత్రలేగా! నిజానికి తన వయసుకు తగ్గ పాత్రలు ఇప్పుడు చేస్తున్నాడు. సెప్టెంబర్ 21న రానున్న ‘జై లవకుశ’లో ఎన్టీయార్ ది త్రిపాత్రాభినయం. ముగ్గుర్లో ‘జై’ పెద్ద క్రూరుడు. అలాంటి పాత్ర చేయడం తారక్ కి ఇదే ప్రథమం. అంటే... ఇందులో కొత్త తారక్ ని చూడబోతున్నాం అన్నమాట. వాళ్ల తాత విలన్ పాత్రకు కూడా కొత్త గౌరవం తెచ్చాడు. మరి తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడా? లేదా? తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.